world record by dancing on ice : మంచుగడ్డపై నృత్యం చేసి ప్రపంచ రికార్డ్ సాధించిన కూచిపూడి డ్యాన్సర్
Kuchipudi Dancer sowmya Creates World Records : మంచుగడ్డపై ఓ యువ నర్తకి నృత్యం చేసి ప్రపంచ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. ఇందుకు హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సమావేశ మందిరం వేదిక అయ్యింది. 8 శ్లోకాలతో, 8 అష్టహారతిలతో ఉపయోగిస్తూ 8 నిమిషాల పాటు ఎనభై కేజీల బరువున్న ఐస్ క్యూబ్ మీద కూచిపూడి నాట్యం చేస్తూ యువ నర్తకి బొమ్మకంటి సౌమ్య రికార్డు సృష్టించారు. స్పందన నృత్య కేళి, స్పందన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక ప్రదర్శనకు ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి హాజరయ్యారు. భారత వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు లయన్, కేవీ రమణారావుతో కలిసి నర్తకి సౌమ్యను సత్కరించి 8 ప్రపంచ రికార్డుల పత్రాలను అందజేశారు. సాధన చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందని దీనికి సౌమ్య గొప్ప ఉదాహరణ అని.. భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తారని రమణాచారి అన్నారు. అనంతరం సౌమ్య మాట్లాడుతూ గురువు డాక్టర్ నామన్ రవికుమార్ నేర్పిన విద్యతో 8 ప్రపంచ రికార్డులు సాధించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.