Harish Rao Speech at Telangana Assembly : 'తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రభాగాన రాష్ట్రం.. ఆర్థిక క్రమశిక్షణ వల్లే ఇదంతా' - Telangana Assembly today news
Harish Rao Speech at Telangana Assembly : బీఆర్‌ఎస్ సర్కార్ ఆర్థిక క్రమశిక్షణ వల్లే తలసరి ఆదాయం విషయంలో రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్ర అప్పులు, వృద్ధి రేటు, తలసరి ఆదాయం గురించి విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. సాగు నీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో మూలధన వ్యయం పెంచడం వల్లే తలసరి ఆదాయం పెరిగిందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. దేశంలో అతి తక్కువ అప్పు తీసుకున్న రాష్ట్రాల్లో కింది నుంచి ఐదో స్థానంలో తెలంగాణ ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన నాడు రూ.4 లక్షల 51 వేల 580 కోట్లు ఉన్న జీఎస్‌డీపీ.. ఇప్పుడు రూ.13 లక్షల 13 వేల 391 కోట్లకు పెరిగిందని మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రంలో రహదారులు, కొత్త జిల్లాల ఏర్పాటు, రాజధాని ప్రాంత అభివృద్ధితో తెలంగాణ వృద్ధి సాధిస్తోందని హరీశ్‌రావు అసెంబ్లీలో పేర్కొన్నారు.