'కాళేశ్వరంపై సీబీఐతో విచారణ చేయిస్తామని చెప్పి - ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించడం ఏంటి'
Published : Jan 3, 2024, 4:04 PM IST
BJP MP Laxman Demand for Kaleswaram Investigation : సీబీఐతో కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద విచారణ జరిపించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంపై సీబీఐతో విచారణ చేయిస్తామని చెప్పి, ఇప్పుడు రిటైర్డ్ సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ వరకే ప్రాజెక్టులో జరిగిన అవినీతిని పరిమితం చేస్తోందని ఆక్షేపించారు.
Kaleswaram Investigation :ప్రభుత్వానికి చిత్త శుద్ది ఉంటే సీబీఐ విచారణ కోరాలని, మింగిన సొమ్మును కక్కించాలన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేననే అనుమానం కలుగుతోందన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన, పార్టీ శ్రేణులతో కలిసి ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు. సావిత్రి జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని లక్ష్మణ్ తెలిపారు. సావిత్రిబాయి ఫూలే సమాజంలోని అనేక రుగ్మతలకు వ్యతిరేఖంగా పోరాటం చేశారని వివరించారు. ఆమె ఆశయాలను నరేంద్ర మోదీ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. చట్ట సభల్లో మహిళల ప్రాతినిథ్యం పెంచేందుకు మోదీ మహిళా బిల్లును తీసుకువచ్చారని తెలిపారు.