Kaleshwaram Project : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ఘట్టం ఆవిష్కృతం... ఏకకాలంలో 35 మోటార్లు రన్ - కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ఘట్టం
Another Milestone Discovered in Kaleshwaram Project : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా అన్ని పంపుహౌస్‌లలో కలిపి ఏకకాలంలో 35 మోటార్లను నడిపించారు. గతంలో లింక్-1, 2లోని మోటార్లతో మాత్రమే ఎత్తిపోసేవారు. తాజాగా వీటితోపాటు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలోని పంపుహౌస్‌లలో లింక్-4 మోటార్లనూ ఒకేసారి నడిపించారు. వానాకాలం పంటలకు సరిపడా నీరందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రక్రియ ఈ నెల 3న ప్రారంభించగా గోదావరికి ఇన్‌ఫ్లో, విద్యుత్తు లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ క్రమేణా మోటార్ల సంఖ్య పెంచుతున్నారు. శనివారం లక్ష్మి పంపుహౌస్‌లో 7, సరస్వతి, పార్వతి పంపుహౌస్‌లలో 5 చొప్పున, నంది, గాయత్రి పంపుహౌస్‌లలో రెండు చొప్పున మోటార్లను నడిపించారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలోని రాంపూర్, రాజేశ్వర్‌రావుపేట, ముప్కాల్ పంపుహౌస్‌లలో 4 చొప్పున మొత్తం 12 మోటార్లను నడిపిస్తూ శ్రీరాంసాగర్‌లోకి నీటిని తరలిస్తున్నారు. పథకం నాలుగో లింక్‌లోని అన్నపూర్ణ జలాశయం, రంగనాయకసాగర్ పంపుహౌస్‌లలో ఒక్కో మోటారు చొప్పున నడిపించారు. ఇలా మొత్తం 10 పంపుహౌస్‌లలో 35 మోటార్లతో ఎత్తిపోతలు కొనసాగాయి. ఎస్సారెస్పీలో 30 టీఎమ్సీల నిల్వ చేరే వరకు కాళేశ్వరం జలాలను రోజుకో టీఎమ్సీ చొప్పున తరలిస్తామని నీటిపారుదలశాఖ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు.