అన్నీ ఒకవైపు.. రోగనిరోధకశక్తి ఒకవైపు. ఇన్‌ఫెక్షన్ల విషయంలో ఇది ముమ్మాటికీ నిజం. రోగనిరోధకశక్తి సరిగా ఉంటే ఇన్‌ఫెక్షన్లేవీ దరిచేరవు. ఇది తగ్గటం మూలంగానే ప్రస్తుతం ఎంతోమంది వృద్ధులు కొవిడ్-19 బారిన పడుతున్నారు. తీవ్రతా ఎక్కువగానే ఉంటోంది. మరణాలు కూడా వీరిలోనే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే ఇప్పుడు అందరి చూపూ రోగనిరోధక వ్యవస్థ మీదే పడింది.
ఇది మనం తల్లి కడుపులో ఉండగానే రూపొందటం మొదలవుతుంది. తల్లి మాయ నుంచి గర్భస్థ శిశువుకు ఇమ్యూనోగ్లోబులిన్ల రూపంలో నిరోధక శక్తి అందుతుంది. ఇది తల్లికి అంతకుముందు వచ్చిన జబ్బులు, తీసుకున్న టీకాలకు ఏర్పడ్డ నిరోధకతను బట్టి ఆధారపడి ఉంటుంది. తల్లిపాలతోనూ కొన్ని ఇమ్యునోగ్లోబులిన్లు బిడ్డకు సంక్రమిస్తాయి. వీటితో లభించిన నిరోధకశక్తి కొన్ని నెలల పాటు కాపాడుతుంటుంది. ఆ తర్వాత ఎదుర్కొన్న ఇన్‌ఫెక్షన్లు, తీసుకున్న టీకాలు, పేగుల్లోని బ్యాక్టీరియాను బట్టి ఒంట్లో సహజ నిరోధక వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది. ఇదే మనల్ని కాపాడుతూ వస్తుంటుంది. కాకపోతే ఇది క్రమంగా క్షీణిస్తుంటుంది. కౌమార దశ నుంచే దీని క్షీణత మొదలవుతుంది. ఇలా వయసు పెరుగుతున్నకొద్దీ క్రమంగా తగ్గుతూ వస్తుంటుంది.
దీర్ఘకాల సాధనతోనే..
60ల్లోకి అడుగుపెట్టాక క్షీణత వేగం మరింత పెరుగుతుంది. అలాగని ఈ సూత్రం అందరికీ వర్తించాలని లేదు. వయసుతో నిమిత్తం లేకుండా కొందరికి రోగనిరోధక సామర్థ్యం ఎక్కువగా ఉండొచ్చు. కొందరికి తక్కువగానూ ఉండొచ్చు. మంచి విషయం ఏంటంటే- కొన్ని తేలికైన జాగ్రత్తలతో రోగనిరోధక శక్తి ‘గడియారాన్ని’ సరిదిద్దుకునే అవకాశం ఉండటం. ఎప్పుడో 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ తర్వాత కొవిడ్-19ను అతిపెద్ద మహమ్మారిగా పరిగణిస్తున్న నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యం పెరిగింది. కరోనా ఇప్పుడప్పుడే పోయేది కాదు. ఇప్పుడు పోయినా మళ్లీ తిరిగి రాదనే భరోసా ఏదీ లేదు. అందువల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవటం చాలా ముఖ్యం. దీంతో కరోనాను మాత్రమే కాదు. ఎలాంటి వైరస్‌నైనా సమర్థంగా నిలువరించొచ్చు, ఎదుర్కోవచ్చు. నిరోధకశక్తిని పెంచుకోవటమనేది ఒక్కరోజుతో సాధ్యమయ్యేది కాదు. ఇదో నిరంతర సాధన. మున్ముందు మనం చేయబోయే సుదీర్ఘ యుద్ధాన్ని ఈ దీర్ఘకాల సాధనతోనే గెలవగలమని గుర్తుంచుకోవాలి.
థైమస్ కీలకం..
రోగనిరోధకశక్తిలో థైమస్ గ్రంథి కీలకపాత్ర పోషిస్తుంది. ఇది ఛాతీ మధ్యభాగంలో ఉంటుంది. టి-కణాలు పరిపక్వమయ్యేది ఇందులోనే. బాల్యంలో చురుకుగా ఉండే థైమస్ గ్రంథి వయసు పెరుగుతున్నకొద్దీ క్షీణిస్తుంటుంది. కౌమారం మొదలయ్యాక ఏటా 3 శాతం చొప్పున పరిమాణం తగ్గుతూ వస్తుంది. మధ్యవయసు వచ్చేసరికి చిన్న పోచల్లా మిగిలిపోతుంది. వృద్ధాప్యంలో దాదాపు పూర్తిగా కనుమరుగైపోతుంది. వృద్ధాప్యంలో కొత్త హానికారక క్రిములను ఎదుర్కోవటం కష్టం కావటానికి ఇదీ ఒక కారణమే. ప్రస్తుతం పిల్లల్లో కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉండటం ఒకరకంగా థైమస్ గ్రంథి చలవేనని చెప్పుకోవచ్చు.
ఏంటీ రోగనిరోధక వ్యవస్థ?
మన ఒంట్లో మెదడు తర్వాత అత్యంత సంక్లిష్టమైంది రోగనిరోధక వ్యవస్థే. ఇది వందలాది రకాల కణాలు, వాటికి సూచనలిచ్చే కణ సంకేతాలు, వీటన్నింటినీ నడిపించే 8వేల జన్యువులతో ముడిపడి ఉంటుంది. దీన్ని స్థూలంగా రెండు భాగాలుగా విభజించుకోవచ్చు.
1. సహజ వ్యవస్థ: ముందువరుసలో ఉండేది ఇదే. ఒంట్లోకి ఏవైనా ప్రవేశిస్తే దీనిలో భాగమైన నూట్రోఫిల్స్, మాక్రోఫేజస్ వంటి రక్తకణాలు వెంటనే స్పందించి, చంపటానికి ప్రయత్నిస్తాయి.
2. సముపార్జిత వ్యవస్థ: టి-కణాలు, బి-కణాలు, యాంటీబాడీలన్నీ దీనిలోని భాగాలే. ఇవి ప్రత్యేకమైనవి. ఆయా సూక్ష్మక్రిముల మీదే దాడి చేస్తాయి. కాస్త నెమ్మదిగా స్పందిస్తాయి. బి-కణాలకు జ్ఞాపకశక్తి కూడా ఉంటుంది. మనం ఏదైనా ఇన్‌ఫెక్షన్ బారినపడ్డప్పుడు దానికి కారణమైన సూక్ష్మక్రిములను గుర్తుంచుకుంటాయి. అవి ఎప్పుడైనా మళ్లీ దాడిచేస్తే గుర్తుపట్టి, యాంటీబాడీలను పురమాయించి వాటి పని పడతాయి. ఫ్లూ వంటి కొన్నివైరస్‌లు బి-కణాల కంట పడకుండా తమ జన్యు నిర్మాణాన్ని మార్చేసుకుంటూ ఉంటాయి. కొత్త కరోనా వైరస్ కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు మరింత పని పెడుతోంది. అందుకే ఏమాత్రం నిర్వీర్యమైనా తీవ్ర చిక్కులు కలిగిస్తోంది.
ఎందుకు తగ్గుతుంది?
వయసుతో పాటు రోగనిరోధకశక్తి క్షీణిస్తుండటాన్ని చాలామంది పెద్దగా పట్టించుకోరు. అప్పటికప్పుడు దీంతో ముంచుకొచ్చే ముప్పేమీ లేదనే భావిస్తుంటారు. ఇది పెద్ద తప్పు నిజానికి కౌమారంలోనే రోగనిరోధకశక్తి తగ్గటం మొదలవుతుంది. మన జీవనశైలితో ముడపడిన రకరకాల అంశాలు దీన్ని మరింత వేగంగా తగ్గిస్తుంటాయి. ఉదాహరణకు- పొగతాగేవారు, ఊబకాయులు, శారీరక శ్రమ అంతగా చేయనివారిలో రోగనిరోధక సామర్థ్యం ఆయా వయసుల్లో ఉండాల్సిన దాని కన్నా తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఒంట్లోకి క్రిముల వంటివేవైనా ప్రవేశించినప్పుడు నూట్రోఫిల్స్ అనే తెల్లరక్తకణాలు వెంటనే గుర్తించి, చుట్టుముట్టేస్తాయి. సైటోకైన్ల వంటి రసాయనాలను పెద్దఎత్తున విడుదల చేసి వాటి మీద చల్లుతాయి. లేదా వాటి చుట్టూ దడి కట్టేస్తాయి. వయసు మీద పడుతున్నకొద్దీ ఈ ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ‘వృద్ధ’ న్యూట్రోఫిల్స్ క్రిములను గుర్తించినా సరిగా వేటాడలేవు. ఒక్కోసారి దారి తప్పుతుంటాయి కూడా. దీంతో ఒకవైపు రక్షణ వ్యవస్థ వేగం, సామర్థ్యం క్షీణిస్తుంటే.. మరోవైపు వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) మొదలవుతుంటుంది. దారితప్పిన న్యూట్రోఫిల్స్ చేసే అనర్థం అంతా ఇంతా కాదు. ఇవి కాస్తో కూస్తో పనిచేసే న్యూట్రోఫిల్స్‌కూ హాని చేస్తాయి. ఇలాంటివన్నీ ప్రస్తుతం వృద్ధులకు కరోనా ముప్పు పెరగటానికి దారితీస్తున్నాయి.
పెంచుకునే మార్గముంది..