బరువు తగ్గకపోవటానికి అదేపనిగా వ్యాయామం చేయడమో, లేక తిండి మానేయడమో కారణం కాకపోవచ్చు. మరేంటి? అంతకు మించిన కారణాలు ఏమున్నాయి అంటారా?
ఆహారపు అలవాట్లు మారాలి..
ఎక్కువగా వ్యాయామం చేస్తున్నాం కాబట్టి ఎంతైనా తినేయొచ్చు అనుకోవడమూ సరికాదు. శరీరానికి మాంసకృత్తులతోపాటూ ఇతర పోషకాలూ సమపాళ్లలో అందాలి. వాటిని సరైన దిశలో ఖర్చు చేయాలి. అప్పుడే ఆరోగ్యంగానే కాదు.. అందంగానూ కనిపించొచ్చు. ఉదాహరణకు ఆహార నియమాలు, వ్యాయామం రెండూ కలిసి 80:20 పద్ధతిలో ఉండాలి. అంటే ఎనభైశాతం ఆహారనియమాలను మార్చుకుని, ఇరవైశాతం వ్యాయామం చేస్తే సరైన ఫలితాలు అందుతాయనేది ఓ అధ్యయనం వెల్లడిస్తోన్న విషయం.
అదే పనిగా వద్దు..
బరువుని అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామం అవసరమే. కానీ అదే పనిగా వ్యాయామం చేస్తేనే సన్నబడతాం అనుకోవడం పొరపాటు. మితిమీరిన వ్యాయామం అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. అలసిపోయేలా కూడా చేస్తుంది.
నిద్ర తప్పనిసరి..
రోజూ కనీసం ఎనిమిది గంటలైనా సరే! తగినంత నిద్రలేకపోతే మీరెంతగా ఆహారనియామాలు పాటించినా, వ్యాయామం చేసినా బరువు అదుపులో ఉంచుకోవడం సాధ్యం కాదనేది ఓ అధ్యయనం చెబుతోన్న వాస్తవం. శరీరానికి సరిపడా విశ్రాంతి లేకపోయినప్పుడు ఆహారంతో పాటు తీసుకున్న కెలరీలు సరిగా ఖర్చుకావు. దీనివల్ల అధికబరువు పెరగడమే కాదు నీరసం కూడా తోడవుతుంది. దాంతో ఎక్కువ సమయం వ్యాయమాలు చేయలేరు. ఒకవేళ కఠిన వ్యాయమాలు చేసినా పెద్దగా ప్రయోజనము ఉండకపోవచ్చు. అందుకే తప్పనిసరిగా గాఢ నిద్రపోయేలా చూసుకోండి.
ఇదీ చదవండి: విపరీతమైన తలనొప్పి.. మైగ్రేనా లేక కరోనానా?