తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

గురకే కదా అని వదిలేస్తే ఇక అంతే!

పడుకునేటప్పుడు పరిసరాలు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత చక్కగా నిద్రపడుతుంది. చిన్న పాటు శబ్ధం వినిపిస్తేనే చిరాకు ఎక్కువ అవుతుంది. మరి అలాంటిది గురక పెడితే.. ఇక అంతే. మరి ఈ గురక వెనుక అసలు కథ ఏమిటి?

By

Published : Apr 25, 2020, 7:48 AM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

These risks should not be avoided for those who sleep snoring
గురకే కదా అని వదిలేస్తే ఇక అంతే!

కొందరు గురక పెడితే పక్క నుంచి రైలు పోతున్నట్టే ఉంటుంది. ఆ చప్పుడు పడకగదిని దాటి హాలులోకి వినబడుతుంటుంది. దీంతో చుట్టుపక్కల వాళ్ల నిద్ర కూడా దెబ్బతింటుంది. అలాగని గురక పెట్టే వాళ్లు హాయిగా నిద్రపోతున్నారని అనుకోవటానికీ లేదు. ఎందుకంటే ఇది నిద్రలో శ్వాసకు ఆటంకం కలగజేసే (స్లీప్‌ అప్నియా) సమస్యకు సంకేతం కావొచ్చు.

గురక పెట్టే వారికి నిద్రపోతున్నప్పుడు గొంతు వెనకాల భాగం బాగా వదులై కిందికి జారి.. శ్వాస మార్గానికి అడ్డుపడుతుంది. దీంతో కొద్దిసేపు శ్వాస ఆగిపోయి.. హఠాత్తుగా మెలకువ వచ్చేస్తుంటుంది. గొంతు కండరాలు సర్దుకోగానే గురక తగ్గి, నిద్ర పడుతుంది. గురకపెట్టే వారికీ విషయం తెలియకపోవచ్చు కానీ నిద్రపోవటం, మెలకువ రావటం.. ఇలా రాత్రంతా చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది. చాలామంది దీన్ని పట్టించుకోరు. గురకే కదా, ఏం చేస్తుందిలే అని అనుకుంటుంటారు.

ఎన్నో ప్రమాదాలు

ఈ స్లీప్‌ అప్నియాను పట్టించుకోకపోతే పక్షవాతం, అధిక రక్తపోటు, గుండెజబ్బు వంటి తీవ్రమైన సమస్యల ముప్పు పెరుగుతుంది. మరీ అతిగా గురకపెట్టే వారికి మెలకువ వచ్చాక తిరిగి నిద్ర పట్టకపోవచ్చు కూడా. ఇది దిగులు, మతిమరుపు, ఏకాగ్రత కుదరకపోవటం, నోరు ఎండిపోవటం, కుంగుబాటు, నిస్సత్తువ వంటి వాటికీ దారితీయొచ్చు. అధిక బరువు, ముక్కు దిబ్బడ, నిద్రపోతున్నప్పుడు నోటితో శ్వాస తీసుకోవటం, నిద్రను ప్రేరేపించే మద్యం లేదా మందులను పడుకోవటానికి ముందు తీసుకోవటం వంటివీ గురకకు దారితీయొచ్చు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీన్ని తగ్గించుకునే అవకాశముంది.

  • బరువు అదుపులో ఉంచుకోవటం అన్ని విధాలా మంచిది.
  • నిద్రపోవటానికి ముందు మద్యం వంటివి తీసుకోకూడదు.
  • అలర్జీతో బాధపడేవారు దీన్ని తగ్గించే మాత్రలు లేదా ముక్కుతో పీల్చుకునే మందులు వాడుకోవాలి.
  • వెల్లకిలా కాకుండా పక్కకు తిరిగి పడుకుంటే అంగిలి భాగం శ్వాస మార్గానికి అడ్డుపడకుండా చూసుకోవచ్చు.

ఇదీ చదవండి:కరోనాపై పోలీసుల ప్రాంక్​.. వీడియో వైరల్​

Last Updated : May 21, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details