శరీరంలోని అవయావాలన్నీ సరిగ్గా పనిచేయాలంటే రక్త ప్రసరణ చాలా కీలకం. అందుకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
అదే పనిగా కూర్చోవద్దు..
గంటలకొద్దీ కదలకుండా కూర్చోవటం రక్త ప్రసరణకు, వెన్నెముకకు మంచిది కాదు. అదేపనిగా కూర్చుంటే కాళ్ల కండరాలు బలహీనపడతాయి. కాళ్లకు రక్త సరఫరా మందగిస్తుంది. రక్తనాళాల్లో గడ్డలూ ఏర్పడొచ్ఛు. ఇది పెద్ద సమస్య. రక్తనాళాలు ఉబ్బిపోయి చూడటానికి ఇబ్బందిగానూ ఉంటుంది. తీవ్రమైతే కాళ్ల మీద పుండ్లు పడొచ్ఛు అందువల్ల కూర్చొని పనులు చేసేవాళ్లు మధ్యమధ్యలో లేచి నాలుగడుగులు వేయటం మంచిది. దీంతో కాలి సిరల్లోని కవాటాలు సరిగా పనిచేస్తాయి. గుండెకు రక్తాన్ని బాగా చేరవేస్తాయి.
పొగకు దూరంగా:పొగాకులోని నికొటిన్ రక్తనాళాల గోడలను దెబ్బతీస్తుంది. రక్తం చిక్కగా అయ్యేలా చేస్తుంది. దీంతో రక్తం సరిగా ముందుకు సాగదు. కాబట్టి సిగరెట్లు, బీడీలు, చుట్టల జోలికి వెళ్లొదు. ఒకవేళ వీటిని కాల్చే అలవాటుంటే వెంటనే మానెయ్యటం ఉత్తమం.
రక్తపోటు నియంత్రణ: అధిక రక్తపోటుతో రక్తనాళాలు గట్టిపడతాయి. ఇది రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. కాబట్టి రక్తపోటు 120/80 కన్నా మించకుండా చూసుకోవాలి. ఇంతకన్నా తక్కువున్నా మంచిదే. వృద్ధాప్యం, ఇతరత్రా సమస్యలను బట్టి రక్తపోటు పరిమితి ఆధారపడి ఉంటుంది. డాక్టర్‌ను సంప్రదించి ఎవరికి, ఎంత వరకు ఉండొచ్చో నిర్ణయించుకోవాలి.
తగినంత నీరు: రక్తంలో దాదాపు సగం వరకు నీరే ఉంటుంది. నీటి శాతం తగ్గితే రక్తం చిక్కబడి సరఫరాకు ఇబ్బంది కలగొచ్ఛు అందువల్ల తగినంత నీరు తాగటం మంచిది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరైనా తాగాలి. వ్యాయామం చేసేవారికి, బయట తిరిగే పనులు చేసేవారికి మరింత ఎక్కువ నీరు అవసరం.