ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఒత్తిడి, మానసిక సమస్యల వల్ల సరైన నిద్రను పొందలేకపోతున్నారు. 2021 నవంబర్‌లో స్లీప్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. 13 దేశాల నుంచి 22,330 మంది పెద్దవారిని సర్వే చేయగా ప్రతి ముగ్గురిలో ఒకరికి నిద్రలేమి లక్షణాలు ఉన్నాయని తేలింది. దాదాపు 20 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ గణాంకాలు కొవిడ్ ముందు ఉన్నదాని కంటే రెట్టింపు.
కొవిడ్ మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన తర్వాత ప్రజలు చాలా వరకు ఫోన్‌కు అలవాటు పడ్డారు. ఇది నిద్రలేమికి ప్రధానమైన కారణం. ఇదే గాక ఒత్తిడి కూడా నిద్రపై అధిక ప్రభావం చూపుతుంది అనడంలో సందేహం లేదు. ప్రతి మనిషికి రోజు 7 నుంచి 8 గంటల నిద్ర అనేది అవసరం. మానసిక ఆరోగ్యానికి సరైన నిద్ర అనేది చాలా అవసరం. మరి మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే నిద్ర సరిగ్గా లేకపోతే అనారోగ్యం పాలవక తప్పదు. సరైన నిద్ర లేకపోతే ఒక మనిషి ఎప్పుడూ చిరాకుగా ఉంటాడు. నిద్రలేమి సమస్యలు ఇలాగే కొనసాగితే అది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి నిద్రపోకపోవడానికి అత్యంత సాధారణ కారణాల గురించి తెలుసుకుందాం.
ఎలక్ట్రానిక్ వస్తువులను అధికంగా ఉపయోగించడం
మహమ్మారి సమయంలో చాలా మంది ఎంటర్టైన్మెంట్ కోసం ఫోన్, టీవీలపై అధికంగా ఆధారపడ్డారు. తినే సమయంలో కూడా వీటి ముందు కూర్చునే తింటున్నారు. ఈ అలవాటే ప్రస్తుతం అతి పెద్ద సమస్యగా మారింది. అయితే నిద్ర రావడానకి 2 గంటల ముందు 'మెలటొనిన్' అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇదే నిద్ర రావడానికి ప్రధాన కారణం. మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల ఈ హార్మోన్ విడుదల అనేది ఆగిపోతుంది. దీని వల్ల నిద్రపట్టకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే నిద్రపోవడానికి 2 గంటల ముందే ఫోన్‌ను దూరం పెట్టాలని వైద్యులు చెబుతున్నారు.
నిద్రకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం
ఏదైనా పని ఉన్నప్పుడు నిద్ర గురించి పట్టించుకోము. స్నేహితులతో, సన్నిహితులతో రాత్రి సమయంలో గంటల తరబడి మాట్లాడుతుంటాం. కానీ నిద్ర గురించి మాత్రం ఆలోచించము. మరీ ముఖ్యంగా యువతలో లేట్ నైట్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది. హోం వర్క్, ప్రాజెక్ట్ వర్క్ ఇలా రకరకాల కారణాల వల్ల రాత్రిళ్లు అధిక సమయం మేల్కొంటున్నారు. ఇది నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోతే అది పగటివేళ ప్రభావం చూపుుతుంది. చురుకుగా పనిచేయలేము. అలాగే తరచుగా లేట్‌నైట్ ఉంటే ఆరోగ్య సమస్యలొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. రాత్రి సమయంలో కావాల్సిన నిద్ర ఉంటే అది మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.
వయసు సంబంధిత సమస్యలు
వృద్ధాప్యంలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. చాలా రకాలు నొప్పులు వారిని ఇబ్బంది పెడుతుంటాయి. రకరకాల మెడిసిన్లను వాడుతుంటారు. అలాగే రాత్రి సమయంలో మూత్రానికి లేవడం కూడా వారికి కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమస్యల వల్ల వారు రాత్రి సమయంలో సరైన నిద్రను పొందలేరు. దీని వల్ల వారు సరైన నిద్రలేక ఒత్తిడికి గురవుతుంటారు. అయితే వృద్ధులు రాత్రి సమయంలో కెఫిన్ పదార్థాలను తీసుకోకుండా ఉండటం, పడుకునే ముందు వేడి పాలను తాగడం వల్ల వారు మంచి నిద్రను పొందే అవకాశం ఉంది.
కెఫిన్, మద్యం సేవించడం
పడుకోవడానికి ముందు కెఫిన్ ఉన్న పదార్థాలను, మద్యం సేవించడం అనేది నిద్రకు ప్రధాన ఆటంకం అనే చెప్పవచ్చు. నిద్ర పోవడానికి 6గంటల ముందు నుంచే కెఫిన్ పదార్థాలను తీసుకోకూడదు. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. కెఫిన్ అనేది మనం చురుకుగా ఉండటానికి దోహదపడుతుంది. అలాంటిది బెడ్ టైమ్‌కు ముందు ఈ పదార్థాలను తీసుకుంటే నిద్ర పట్టదు. అలాగే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రిఫ్రెష్ అయిన భావన కలుగుతుంది. శరీరం డీహైడ్రేట్ అవ్వటం వల్ల నిద్ర అనేది పట్టదు. కాబట్టి నిద్ర పోవడానికి ముందు కెఫిన్, మద్యం సేవించకపోవడం ఉత్తమం.
ఒత్తిడి
ఒత్తిడి లాంటి మానసిక సమస్యలు కూడా నిద్రలేమి సమస్యలను కలిగిస్తాయి. ఇలాంటి మానసిక ఆరోగ్య సమస్యల వల్ల మన మెదడు అనేది నిద్రకు ఉపక్రమించదు. యాంగ్జైటీ, నిద్ర అనేది రెండు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. యాంగ్జైటీ అనేది సరైన నిద్ర లేకుండా చేస్తుంది. ఆరోగ్య సమస్యలు, రిలేషన్షిప్, కుటుంబ సమస్యలు, పని ఒత్తిడి వల్ల.. సరిగా నిద్ర పట్టకుండా మనసు ఆందోళనకు గురవుతుంటుంది. సమస్యలన్నీ మెదడుకు ఒత్తిడిని కలిగించి గుండె వేగం పెరిగేలా చేస్తాయి. దీని వల్ల ఏదో ప్రమాదం ఉందని ఆలోచిస్తూ సరైన నిద్ర అనేది లేకుండా చేస్తాయి ఇలాంటి మానసిక సమస్యలు. అందుకే ఒత్తిడి నుంచి బయటపడటానికి యోగా, మెడిటేషన్‌లాంటివి చేయాలని డాక్టర్లు సూచిస్తుంటారు.