ఫిల్మ్‌సిటీలోని ‘సుఖీభవ’... జీవనశైలి జబ్బులకు సంజీవని అనడంలో అతిశయోక్తి లేదు. మందులూ శస్త్రచికిత్సలతో పని లేకుండానే ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, యోగా, పోషకాహారం తీసుకోవడం... వంటి ఆధునిక, సంప్రదాయ వైద్య విధానాల్ని మేళవించి చికిత్స చేయడం ద్వారా అనేక సమస్యల్ని సమర్థంగా నివారించగలుగుతున్నారు ‘సుఖీభవ’ నిపుణులు. అందులో భాగంగానే ప్రస్తుతకాలంలో అతిపెద్ద సమస్యగా మారిన ఊబకాయాన్నీ తగ్గించవచ్చు అంటున్నారు దీని నిర్వాహకురాలు డా.అర్చన.
ఎందుకంత బరువు?
21వ శతాబ్దంలో దేశ జనాభాలో ఐదుశాతం ఊబకాయంతో బాధపడుతుంటే మరెందరో అధిక బరువుతో సతమతమవుతున్నారు. ఈ సంఖ్య ఏటికేడూ పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. ఇరవయ్యేళ్ల క్రితం బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నవాళ్లు ఏడాదికి నలుగురైదుగురు మాత్రమే ఉంటే, గతేడాదికి ఆ సంఖ్య ముప్ఫై వేలకు పెరిగింది. దీన్నిబట్టి ఊబకాయం ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. అనారోగ్యకరమైన ప్రాసెస్డ్ ఆహార పదార్థాలూ ఫాస్ట్ ఫుడ్ల వాడకం పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. మధ్య తరగతి ఆదాయం పెరగడం, పిల్లలకి అడిగిందల్లా కొనిచ్చే సంస్కృతి పెరగడం, ఆహారవేళలు పాటించకపోవడం... వంటివీ వీటికి తోడయ్యాయి. దాంతో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ లావైపోతున్నారు. జీవనశైలిలో వేగం ఈ సమస్యని మరింత పెంచి పోషిస్తోంది. అరమైలు దూరానికి కూడా ఆటో, మోటార్‌సైకిల్ లేదా కారెక్కాల్సిందే. దాంతో నడవడం, సైకిల్ తొక్కడం దాదాపు మర్చిపోయారు. ఇవన్నీ సరిపోవన్నట్లు ఇంటర్‌నెట్ పుణ్యమా అని ప్రపంచ వంటకాలన్నింటినీ రుచి చూడటం ఓ హాబీగా మారింది. దాంతో తిండికి తగ్గ వ్యాయామం ఉండటం లేదు. పిల్లలకు చదువుల పోటీలూ పెద్దవాళ్లకు వృత్తి సవాళ్లతో ఒత్తిడీ, ఆందోళనలు అధికమై శరీరంలోని హార్మోన్ల వ్యవస్థ దెబ్బతింటోంది. ఫలితం... ఊబకాయం పిలవకుండానే పలుకుతోంది. దీనికి తోడుగా హృద్రోగాలూ మధుమేహం వంటి వ్యాధులూ నీ వెంటే మేం ఉన్నాం అంటున్నాయి. ముఖ్యంగా జన్యువుల కారణంగా భారతీయుల్లో అధికశాతం మందిలో పొట్ట చుట్టూ కొవ్వు పేరు కుంటుంది. దానివల్ల హృద్రోగ సమస్యలు అధికమైనట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఊబకాయం వల్ల ఆయుఃప్రమాణం తగ్గి పోతుందని అధ్యయనాలూ చెబుతున్నాయి. కరోనా సోకిన వాళ్లలోనూ ఊబకాయులకి చికిత్స చేయడం కష్టంగా పరిణమిస్తోంది. మొత్తమ్మీద ఊబకాయం రావడానికి సవాలక్ష కారణాలు ఉన్నట్లే, అది తెచ్చిపెట్టే సమస్యలూ కోకొల్లలు. అందుకే బరువు పెరుగుతున్న సమయంలోనే చికిత్స తీసుకుంటే ఫలితం ఉంటుంది అంటున్నారు ‘సుఖీభవ’ నిపుణులు. అయితే ‘ఇక్కడ చికిత్స అందరికీ ఒకేలా ఉండదు, వ్యక్తిని పరీక్షించి అతనికి సరిపడే పరిష్కారాన్ని సూచిస్తాం’ అంటున్నారు డా.అర్చన.