International Diabetes Day 2022 : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. రాబోయే పదేళ్లలో కొత్తగా పది కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో మధుమేహంవల్ల చనిపోతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఈ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండటంతో భారత్‌ను 'మధుమేహ రాజధాని'గా చెబుతారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అధికంగా డయాబెటిస్ పేషంట్లు ఉన్నారు. వయసు పెరిగేకొద్దీ మధుమేహం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం బాల్య, కౌమార దశల్లోనే టైప్-2 డయాబెటిస్ ప్రబలడం మరింత ఆందోళన కలిగిస్తోంది. వయసు పైబడిన వారిలో సకాలంలో సరైన చికిత్స అందక మృతి చెందేవారు అధికంగా ఉంటున్నారు. గర్భిణుల్లో మధుమేహం అనేక రుగ్మతలకు కారణమవుతోంది. పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికి ఆదిలోనే అది ప్రమాదకరంగా మారుతోంది.
నిశ్శబ్ద విధ్వంసం
సాధారణంగా మధుమేహాన్ని ప్రాథమిక దశలో గుర్తించడం కష్టం. ఎలాంటి లక్షణాలూ లేకుండా ఏళ్ల తరబడి ఈ వ్యాధి శరీరంలో నిశ్శబ్దంగా ఉంటుంది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్‌ను చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. ఆలోగా శరీరం చిక్కి శల్యమై అనేక అవయవాలు రుగ్మతలతో కునారిల్లుతాయి. క్రమశిక్షణతో ఆహార నియమాలను పాటించడం, సరైన మందులను క్రమం తప్పకుండా వాడటంవల్ల అనేక అనర్థాలను నివారించవచ్చు. ప్రజలకు సరైన అవగాహన కలిగించేలా- ఆధునిక వైద్య పరిశోధనా ఫలాలను విశ్వవ్యాప్తం చేయవలసిన అవసరం ఉంది. పిల్లల్లో వచ్చే టైప్-1 డయాబెటిస్‌లో వ్యాధిలక్షణాలు త్వరగానే బయటపడతాయి. కానీ, మధుమేహం చిన్నారుల శారీరక మానసిక ఎదుగుదలకు అవరోధంగా నిలుస్తుంది. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ఇన్సులిన్ తీసుకుంటూ డయాబెటిస్‌ను ఏళ్లతరబడి జయించినవారు ఎందరో ఉన్నారు.
జీవనశైలి విధానాలను మార్చుకోవడం ద్వారా మధుమేహం రాకుండా జాగ్రత్త పడవచ్చు. అప్పటికే మధుమేహం ఉన్నవారు దానివల్ల వచ్చే సమస్యలనూ నియంత్రించవచ్చు. జన్యుపరమైన కారణాలవల్ల వచ్చే మధుమేహాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా- నిలువరించవచ్చు. రక్తంలో చక్కెర, కొవ్వు పదార్థాల స్థాయులను సమతౌల్యం చేసుకొంటూ, ఆహార నియమాలను సక్రమంగా పాటిస్తే మధుమేహ సంబంధిత సమస్యలను అధిగమించవచ్చు. కేవలం ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, లేదా ఆహారాన్ని కట్టడి చేయడం ద్వారా మాత్రమే వ్యాధులనుంచి తప్పించుకోలేం. సమతులమైన మితాహారం తీసుకోవడం ద్వారా సరైన ప్రయోజనం ఉంటుంది. మధుమేహంవల్ల అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్న వారెందరో.