తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఈ చిట్కాలతో పొడి చర్మానికి చెక్!

అందమైన ముఖం ఉంటే సరిపోదు.. నిగనిగలాడే చర్మం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, కొందరిలో మాత్రం ఎన్ని సబ్బులు వాడినా చర్మం పొడిబారిపోతుంది. పొట్టులా రాలిపోతుంది. మృతకణాలు పెరిగిపోతే ముఖంలో జీవకళ ఎలా ఉంటుంది. అందుకే, ఆ పొడిబారిన చర్మాన్ని ఈ చిట్కాలతో సెట్ చేసేద్దాం రండి!

By

Published : Sep 13, 2020, 10:31 AM IST

make dry skin as healthy as possible with these tips
ఈ చిట్కాలతో పొడి చర్మానికి చెక్!

పొడి చర్మం అప్పుడప్పుడూ పొట్టులా రాలిపోతుంటుంది. వాతావరణం తడిపొడిగా ఉండే ఈ సమయంలో చర్మం దురద పుట్టడం, మంట లాంటి సమస్యలూ ఎదురవుతుంటాయి. ఆ సమస్యల్ని తగ్గించుకుని చర్మాన్ని మెరిసేలా చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి..

  • పొడిబారే చర్మతత్వం ఉన్నవారు ఏ కాలంలో అయినా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొడిబారింది కదాని నలుగు పెట్టుకుంటే చర్మం ఇంకా బిరుసుగా మారుతుంది. చర్మంలో ఉండే సహజ నూనెలు కూడా తొలగిపోతాయి. అలాంటివారు అన్నిరకాల సబ్బులు వాడకపోవడం మంచిది. వాడినా అది బాహుమూలలకే పరిమితం చేయాల్సి ఉంటుంది.
  • పీహెచ్‌ స్థాయులు ఐదు నుంచి ఐదున్నర లోపు ఉండే సబ్బులు ఎంచుకోవాలి. లేదా ఫేస్‌, బాడీ వాష్‌లు ఎంచుకోవాలి. స్క్రబ్‌లూ, బ్లీచ్‌ల వంటివి అసలు వాడకూడదు. దీనివల్ల చర్మం ఇంకా పొడిబారుతుంది.
  • కొబ్బరినూనెతో ఒంటికి మర్దన చేసుకున్నాక ఓ అరగంట ఆగి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు జిడ్డుపోయేలా కూడా సబ్బు రుద్దుకోకూడదు. ఆ జిడ్డుని అలానే ఉండనివ్వాలి. కుదిరితే రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా కొబ్బరి, బాదం, ఆలివ్‌.. ఇలా ఏదో ఒక నూనెను శరీరానికి రాసి మర్దన చేసుకోవాలి. ఇవేవీ అందుబాటులో లేకపోతే వంటకు ఉపయోగించే నూనెను కూడా కొద్దిగా రాసుకోవచ్చు.
  • వర్షాకాలంలోనూ అతినీలలోహిత కిరణాల ప్రభావం చర్మంపై పడుతుంది. కాబట్టి సన్‌స్క్రీన్‌లోషన్‌ని రాసుకోవాలి.
  • నలుగుకు బదులుగా చెంచా పాల మీగడలో కొద్దిగా సెనగపిండి చేర్చి ముఖానికి మృదువుగా రాసుకోవాలి. పాలమీగడ అందుబాటులో లేనప్పుడు... బాదం, ఆలివ్‌ వంటి నూనెలు వాడుకోవచ్చు.
  • అలాగే చెంచా సెనగపిండిలో కొద్దిగా తేనె, ఏదైనా నూనె కలిపి ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మురికీ, మృతకణాలు తొలగిపోతాయి. చర్మానికి తేమ అంది మృదువుగా మారుతుంది. వైద్యుల్ని సంప్రదిస్తే లిక్విడ్‌ పారాఫిన్‌ ఉన్న మాయిశ్చరైజర్లు.. గాఢత తక్కువగా ఉన్న సబ్బులు అదీ పీహెచ్‌ స్థాయి 5.5 ఉన్నవి సూచిస్తారు.

ABOUT THE AUTHOR

...view details