నిర్ణయాలు, సమస్యలు, సంతోషాలు, అందోళనలు.. ఇవన్నీ రోజువారీ జీవితంలో ఓ భాగం. అయితే వీటి గురించి నిద్రపోయే ముందే ఆలోచించడం సర్వ సాధారణ. అతిగా ఆలోచించి నిద్రపట్టని రాత్రులు కూడా ఎన్నో ఉంటాయి. అయితే... ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించి మీ మనసును శాంతింపజేసుకుంటే.. ప్రశాంతమైన నిద్ర మీ సొంతం.
ఊపిరిపైనే అంతా..
గట్టిగా ఊపిరి పీల్చుకోండి. ఆ సమయంలో మీ దృష్టి అంతా దానిపైనే ఉండాలి. ఊపిరి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు లెక్కించండి. దీని వల్ల మీరు అతిగా ఆలోచిస్తున్న విషయాల నుంచి మీకు బ్రేక్ లభిస్తుంది. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది.
మంత్రాలు...
మీకు నచ్చిన చిత్రాల్లో ఎన్నో మంత్రాలు, ఊతపదాలు ఉంటాయి. ఉదాహరణకు "ఆల్ ఈజ్ వెల్", "అంతా మన మంచికే". అతిగా ఆలోచిస్తున్నప్పుడు వీటిని మనసులో పదే పదే అనుకోండి. మనసు కుదుటపడుతుంది.
ధ్యానం...
నిద్రపోయే ముందు ధ్యానం చేయండి. మనసును ప్రశాంతపరిచి.. ప్రతికూల ఆలోచనలను ఇది తొలగిస్తుంది.
ఒత్తిడికి చెప్పండి 'నో'...
మీ రోజువారీ పనుల్లో కొన్ని మార్పులు చేసుకోండి. పడుకునేందుకు కనీసం ఒక్క గంట ముందు టెక్నాలజీకి దూరంగా ఉండండి. యోగా చేయండి. పుస్తకాలు చదవండి. వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే నరాలకు ఉపశమనం కలుగుతుంది. మంచి నిద్ర పడుతుంది.