ఎప్పుడూ ఇల్లు, పిల్లలు గురించి ఆలోచించే ఆమెకు ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు! ఒత్తిళ్లు, ఊబకాయం లాంటివన్నీ అధిక రక్తపోటుకు దారితీస్తాయి. గర్భిణుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీన్ని ఆధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
ఊబకాయం, సరైన వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లు లాంటి కారణాలతో పాటు జన్యుపరంగానూ అధిక రక్తపోటు రావొచ్చు. మనదేశంలో మాతాశిశు మరణాలకు కారణమైన సమస్యల్లో ఇదీ ఒకటి. దీన్నే హైపర్‌టెన్షన్ డిజార్డర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇందులో చాలా రకాలు ఉన్నప్పటికీ గుర్రపువాతం మూలంగా మాతృమరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మధుమేహంతో బాధపడేవారు, ఆలస్యంగా గర్భం దాల్చిన మహిళలు ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. ఈ పరిస్థితి మొదటికాన్పులో ఎక్కువ మందికి కనిపిస్తుంది. కొందరిలో రెండో కాన్పులోనూ ఇబ్బందిపెడుతుంది.
ఎలాంటి ప్రమాదం ఉంటుంది?
- గర్భం దాల్చిన ప్రతి ఒక్కరికీ బీపీ రావాలనీ లేదు. బీపీ ఉంటే మాత్రం ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి.
- అధిక రక్తపోటుతో బాధపడుతున్న గర్భవతుల్లో నెలల కంటే ముందే ప్రసవం జరగొచ్చు. దాని ప్రభావం బిడ్డపైనా పడుతుంది. ఈ సమయంలో అధిక రక్తపోటు ఉంటే.. గుండెపోటు, మూర్ఛ ముప్పు ఎక్కువ. కొందరు స్త్రీల్లో మాయ విడిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.