కరోనా వేళ కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు కొందరు వైద్యులు వ్యక్తిగతంగా కూడా ఈ సేవలను అందిస్తున్నారు. దీంతో ఇంటి నుంచే ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా డాక్టర్‌తో మాట్లాడి, అనుమానాలను నివృత్తి చేసుకునే వెసులుబాటు లభిస్తోంది. ఈక్రమంలో ఆన్‌లైన్ కన్సల్టేషన్‌లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
తొందరపడకండి..
సాధారణంగా డాక్టర్ ఎదుట ఉన్నప్పుడే మన సమస్యలను చెప్పుకోవడానికి తొందరపడుతుంటాం. ఆన్‌లైన్ కన్సల్టేషన్‌లో ఇది ఇంకొంచెం ఎక్కువేనని చెప్పాలి. అందులోనూ చాలామందికి ఇప్పటి వరకు వీడియో కాల్‌లో మాట్లాడిన అనుభవం ఉండి ఉండదు. కాబట్టి ఎలాంటి తొందరపాటు లేకుండా.. డాక్టర్‌ను మీరేం ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో ఒక కాగితంపై ముందుగానే రాసిపెట్టుకోండి.
పాత రిపోర్టులను అందుబాటులో ఉంచుకోండి..
కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు. వీరు కచ్చితంగా క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇప్పుడు కూడా సాధ్యమైనంత వరకు రెగ్యులర్‌గా చూపించుకునే వైద్యులనే సంప్రదించడం మంచిది. ఒకవేళ వారు అందుబాటులో లేని సమయంలో మాత్రమే ఇతర వైద్యుల వద్దకు వెళ్లాలి. ఆన్‌లైన్‌లో సదరు డాక్టర్‌ను సంప్రదించే సమయంలో గతంలో ఇతర వైద్యులని సంప్రదించినప్పటి రిపోర్టులన్నింటినీ అందుబాటులో ఉంచుకోవాలి. ఆ రిపోర్ట్స్‌లోని సమాచారం ఆధారంగా వైద్యులకు మీ ఆరోగ్య స్థితిపై ఓ అవగాహన వస్తుంది.
పక్కన ఎవరైనా ఉండాలి..
సాధారణంగా ఆసుపత్రికి వెళ్లే సమయంలో ఎవరినో ఒకరిని తోడుగా తీసుకెళుతుంటాం. దీనివల్ల మనతో ఓ వ్యక్తి ఉన్నాడనే ధైర్యంతో పాటు మన సమస్యను దగ్గరుండి చూస్తారు కాబట్టి.. దాని గురించి డాక్టర్‌కు వీలైనంత స్పష్టంగా వివరించగలుగుతారు. ఆన్‌లైన్ కన్సల్టెన్సీ విషయంలోనూ ఇదే వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ పక్కన మీ ఆరోగ్య సమస్య గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తి ఉండేలా చూసుకోండి. మరీ ముఖ్యంగా వయసు మళ్లిన వారు వీడియోకాల్‌లో అంత సులభంగా మాట్లాడలేరు. ఇలాంటి వారికి కచ్చితంగా సహాయకులు ఉండి తీరాల్సిందే.