HIV AIDS Myths and Facts in Telugu: హెచ్ఐవీ కంటే భయంకరమైన.. అంతకంటే ప్రాణాంతకమైన వ్యాధులు ఎన్నో ఉన్నాయి. కానీ.. వాటి పట్ల లేనంత భయం, అపోహలు, అంతకుమించిన వివక్ష.. HIV పట్ల ఉన్నాయి. నిజానికి హెచ్‌ఐవీకి చికిత్స లేదు.. నివారణ ఒక్కటే మార్గం. కానీ.. వైరస్‌ను అదుపుచేస్తూ.. ఇతర దీర్ఘకాలిక రోగుల మాదిరిగా మందులు వాడుతూ ఎక్కువ కాలం సాధారణ జీవితం గడపవచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అలాగే.. ఈ వ్యాధిపై మెజారిటీ జనానికి పూర్తిగా అవగాహన లేదు. నేడు "ప్రపంచ ఎయిడ్స్ డే" సందర్భంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్ పట్ల ఉన్న అనేక అపోహలు-వాస్తవాలపై ఈటీవీ భారత్ కథనం..
చలికాలంలో చన్నీటి స్నానం చేస్తున్నారా! ఈ ప్రమాదాలు తెలుసా?
World AIDS Day 2023: హెచ్ఐవీ-ఎయిడ్స్.. ఇవి రెండూ ఒకటి కాదు అనే విషయమే చాలా మందికి తెలిదు. HIV అంటే.. హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత.. రోగనిరోధక వ్యవస్థపై దాడి చేయడం మొదలు పెడుతుంది. ఇది క్రమంగా శరీరంలో విస్తరిస్తూ అన్ని వ్యవస్థల్నీ ధ్వంసం చేస్తూ వెళ్తుంది. దీంతో.. శరీరం సహజంగా ఎదుర్కొనే రోగాలను కూడా అడ్డుకోలేకపోతుంది. ఈ క్రమంలో.. చాలా రోగాలు ఒంటిపై దాడిచేస్తాయి. ఫలితంగా శరీరం కృశించుకుపోతూ ఉంటుంది. ఈ పరిస్థితి తీవ్రమైన చివరి దశనే AIDS (అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్) అంటారు. ఈ దశలో శరీరానికి ప్రాణాంతక వ్యాధులతో పోరాడే శక్తి ఉండదు. ఈ పరిస్థితి మరింతగా ముదిరినప్పుడే మరణం సంభవిస్తుంది. అయితే.. హెచ్ఐవీ సోకిన తర్వాత.. అది ఎయిడ్స్ వ్యాధిగా మారడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. ఈ నేపథ్యంలో.. హెచ్‌ఐవీ/ఎయిడ్స్ పట్ల ఉన్న అనేక అపోహలూ, వాస్తవాలను తెలుసుకుందాం.
బాణపొట్ట ఎబ్బెట్టుగా ఉందా? ఉదయాన్నే ఇలా చేస్తే చాలు - ఐస్లా కరిగిపోతుంది!
అపోహలు - వాస్తవాలు:
అపోహ:ముట్టుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా హెచ్‌ఐవీ వ్యాపిస్తుంది.
వాస్తవం: ఎయిడ్స్ రోగులను హత్తుకున్నా, వారికి షేక్ హ్యాండ్ ఇచ్చినా ఆ వ్యాధి రాదు. కేవలం అసురక్షిత సెక్స్, వ్యాధి సోకిన వారి రక్తం ఎక్కించడం ద్వారా మాత్రమే ఇది వ్యాపిస్తుంది.
అపోహ:హెచ్‌ఐవీ సోకినవారికి ఇక జీవితం శూన్యం.
వాస్తవం:హెచ్‌ఐవీని తొలినాళ్లలో మాత్రమే ఈ పరిస్థితి ఉండేది. కానీ .. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. హెచ్‌ఐవీపై నియంత్రణ సాధించగల యాంటీ రెట్రోవైరల్ మందులు కనుగొన్న తర్వాత.. హెచ్‌ఐవీ రోగులు సైతం అందరిలాగే దీర్ఘకాలం బతుకుతున్నారు. ఎప్పటిలాగే తమ పనులు తామే చేసుకోవడం, అందరిలాగే జీవించడం సాధ్యమైంది. హెచ్‌ఐవీ వైరస్‌ను కలిగి ఉండటం తప్ప.. ఇంక వారి సామాజిక జీవితంలో ఎలాంటి అవరోధమూ లేనంత నార్మల్‌గా బతకడం సాధ్యమే.
చలికాలంలో కూడా వేడి చేస్తోందా? కారణాలు ఇవేనట!
అపోహ:హెచ్‌ఐవీ-పాజిటివ్ మహిళలకు పుట్టే పిల్లలకు ఖచ్చితంగా హెచ్‌ఐవీ ఉంటుంది.
వాస్తవం:యాంటీరెట్రోవైరల్ చికిత్స, సి-సెక్షన్, ఇతర ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా.. నవజాత శిశువులకు వైరస్ సంక్రమించే ప్రమాదాన్ని 2% కంటే తక్కువకు తగ్గించవచ్చు.
అపోహ: కండోమ్స్ ధరిస్తే హెచ్ఐవీ రాదు..
వాస్తవం:హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తితో శృంగారంలో పాల్గొనేటప్పుడు కండోమ్ ధరిస్తే చాలు.. ఆ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. శృంగారం సమయంలో కండోమ్ చిరిగిపోవడం, జారిపోవడం, లీక్ అవ్వడం వంటివి జరిగే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటివి జరిగితే హెచ్ఐవీ సోకే ప్రమాదం చాలా ఎక్కువ. అవతలి వారికి హెచ్ఐవీ లేదు అనుకొని కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొనాలనుకున్నా.. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే కొంతమందికి హెచ్‌ఐవీ సోకినా తాము ఆ వ్యాధితో బాధపడుతున్నామన్న సంగతి తెలియట్లేదని కొన్ని గణాంకాలు రుజువు చేస్తున్నాయి.