తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

వ్యాయామానికి ముందు.. తర్వాత ఇవి తప్పనిసరి! - చర్మసౌందర్యం కోసం చిట్కాలు

కొందరు ఆరోగ్యంపై శ్రద్ధతో వ్యాయామాలు చేసినప్పటికీ.. వారి చర్మం నిర్జీవంగా ఉంటుంది. ముఖంపై మొటిమలు పెరుగుతాయి. వర్కవుట్లకు ముందు, వెనుక పాటించాల్సిన నియమాలపట్ల అజాగ్రత్తే దీనికి కారణమని చెబుతున్నారు చర్మసౌందర్య నిపుణులు.

Health tips
ఆరోగ్య చిట్కాలు

By

Published : Sep 2, 2021, 8:30 AM IST

ఉదయం ఓ గంట వర్కవుట్లు, యోగా చేసిన తర్వాతే ఇంటి పనులు మొదలుపెడతారు కొందరు. ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ తీసుకునే వారికి తమ చర్మం ఎందుకంత నిర్జీవంగా ఉందో మాత్రం అర్థంకాదు. అంతేకాదు.. ముఖంపై మొటిమలు పెరగడానికి కారణం తెలియడం లేదు. వారు చేసే వ్యాయామాలు శారీరకారోగ్యాన్ని పరిరక్షిస్తున్నా, వర్కవుట్లకు ముందు, వెనుక పాటించాల్సిన నియమాలపట్ల అజాగ్రత్తే దీనికి కారణమని చెబుతున్నారు చర్మసౌందర్య నిపుణులు.

ముందు..

వ్యాయామానికి ముందు ముఖాన్ని మురికి లేకుండా శుభ్రపరుచుకోవాలి. కొందరు సాయంత్రం సమయాల్లో జిమ్‌కు వెళుతుంటారు. అటువంటప్పుడు ముఖానికి మేకప్‌ లేదా సన్‌స్క్రీన్‌ ఉంటుంది. దాన్నితీసేసి, ఆపై మంచినీటితో శుభ్రపరిచి ముఖం, కాళ్లూ చేతులకు మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవాలి. వర్కవుట్లు చేసేటప్పుడు ముఖానికి పట్టే చెమట బయటికి రావడానికి మేకప్‌ నిరోధంగా ఉంటే, చర్మరంధ్రాల్లో మురికి పేరుకుని మొటిమలుగా మారే ప్రమాదం ఉంది. దుస్తుల విషయంలోనూ శ్రద్ధ వహించాలి. బిగుతైన దుస్తులు చర్మంపై దద్దుర్లు రావడానికి కారణమవుతాయి. వదులైన, సౌకర్యవంతమైన దుస్తులు వ్యాయామం చేసేటప్పుడు చర్మం ఆక్సిజన్‌ను పీల్చుకునేలా సాయపడతాయి. అలా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

ఆ తర్వాత..

వర్కవుట్లు పూర్తి చేసిన తర్వాత చేతులు శుభ్రపరుచుకోకుండా ముఖాన్ని తాకకూడదు. జిమ్‌లోని వ్యాయామాలకు ఉపయోగించే సామాగ్రికున్న మురికి మన చేతులకు అంటుకుంటుంది. వీటిని వెంటనే శుభ్రం చేయకపోతే, చర్మంపై చెడు ప్రభావానికి కారణమవుతాయి. అక్కడి నుంచి వచ్చిన వెంటనే స్నానం చేయాలి. దాంతో ఒంటికి పట్టిన చెమట, దాని ద్వారా చర్మంపై పేరుకున్న వ్యర్థాలన్నీ దూరమవుతాయి. ఆ తర్వాత శరీరానికంతా మృదువుగా మాయిశ్చరైజింగ్‌ క్రీం రాయడం వల్ల చర్మం తాజాగా మారుతుంది. వ్యాయామానికి వెళ్లేటప్పుడు, ఆ తర్వాత రోజు మొత్తంలో ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీటిని తాగడం అలవరుచుకోవాలి. దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటకొస్తాయి. అలాగే డీహైడ్రేషన్‌ నుంచి దూరం చేసి, చర్మాన్ని ఆరోగ్యంగానూ ఉంచుతుంది.

ఇదీ చూడండి:డ్రైఫ్రూట్స్ తింటే గుండెకు మంచిది కాదా?

ABOUT THE AUTHOR

...view details