Summer Cold Home Remedies: జలుబు సాధారణంగా తరచూ ఎదుర్కొనే సమస్యే అయినా రోజూవారీ పనులు చేసుకోవడంలో ఇబ్బందికి గురవుతుంటాం. చాలా మంది నిద్ర పట్టక ఇబ్బందులు పడుతుంటారు. ఇదే జలుబు ఎండకాలంలో వస్తే? దీని వల్ల పడే అవస్థలు చెప్పలేనివి. మరి దీనికి పరిష్కారం ఏంటి? జలుబుతో ఇబ్బందిగా లేకుండా హాయిగా నిద్రపట్టాలంటే నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం.
- జలుబు విపరీతంగా ఉన్నప్పుడు ముక్కుదిబ్బడ వేయడం వల్ల గాలి ఆడని పరిస్థితి ఉంటుంది. అలాగే తలపట్టేయడం, తుమ్ములు, నిరంతరం ముక్కు కారుతూనే ఉండటం వంటి సమస్యలతో ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి కూడా ఉండదు. అందుకే జలుబు చేసేటప్పుడు దాని కారణంగా వచ్చే ఇబ్బందులను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇలాంటప్పుడు మనం ఏవేవో మందులను తెచ్చుకుని వాడుతుంటాం. జలుబుకి వాడే కొన్ని మందులు మనకి నిద్రపట్టకుండా చేస్తే కొన్ని మత్తుని కలిగిస్తాయి. వాటి పనితీరును తెలుసుకుని వాడటం మంచిది.
- ముక్కుపూర్తిగా మూసుకుని పోయినప్పుడు గాలి ఆడేలా చేసే నాసల్ స్ప్రేలను వాడవచ్చు. వేడినీటి స్నానం, ఆవిరి పట్టడం వలన రిలీఫ్‌గా అనిపించొచ్చు. ముక్కుకి వేడి కాపడం పెడ్డటం వలన కూడా కాస్త ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పి ఉంటే ఉప్పు నీళ్లను పుక్కిలించడం వలన ఫలితం ఉంటుంది.
- తలకింద దిండ్లు ఎత్తుగా పెట్టుకుని పడుకుంటే శ్వాస మరింత తేలిగ్గా తీసుకునే వీలుంటుంది. అయితే దిండ్లు ఎక్కువగా పెట్టుకుంటే మెడ వంగటం వలన శ్వాస తీసుకోవటం మరింత కష్టమవుతుంని వైద్యులు అంటారు. మెడ వంగకుండా ఉండేలా తలకింద భాగంలో మంచం లేదా పరుపు పైకి ఉండేలా చేసుకోవచ్చు.
- జలుబు నుంచి ఉపశమనం కోసం గాలిలో తేమని పెంచే పరికరాలు వేపరైజర్లను వాడవచ్చు. రోజూలాగే అదే సమయంలో నిద్రపోయే ప్రయత్నం చేయాలి. నిద్రకు ఉపక్రమించేటప్పుడు గదిలో వెలుతురు లేకుండా చూసుకోవాలి. కిటికీల నుంచి వెలుతురు పడకుండా కర్టెన్లు వేసుకోవాలి. వెలుతురు ఉన్నప్పుడు మన మెదడు నిద్రపోయేందుకు సహకరించదు.
- ఈ జలుబు ఉన్న సమయంలో వాకింగ్ చేయడం కూడా పడుకునే సమయంలో ఉపశమనం కలిగిస్తుంది. అలాగే రూంలో డస్ట్ లేకుండా ఉండేందుకు రూంప్యూరిఫైయర్స్ వాడుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
- జలుబు ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకోకూడదు. దీని వల్ల మత్తుగా ఉంటుంది కానీ గాఢ నిద్రకు అడ్డుపడుతుంది. ఆల్కహాల్ ముక్కు లోపలి భాగాలను వాపుకు గురయ్యేలా చేస్తుంది. అంతేకాదు జలుబుకు వాడే మందులను సరిగ్గా పనిచేయనీయకుండా ఆటంకపరుస్తుంది. జలుబు చేసినప్పుడు ఒంటరిగా నిద్రపోవటం మంచిది, పిల్లలను దగ్గరకు రానీయకూడదు.
- చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. డాక్టర్ సూచిస్తే తప్ప యాంటీబయోటిక్స్‌ని వాడకపోవడమే మేలు. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. పండ్లు, పళ్ల రసాలతో పాటు వేడిగా ఉండే ద్రవ పదార్థాలను తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది. వీటి నుంచి వచ్చే ఆవిరి శ్వాసను తేలికపరుస్తుంది. వాతావరణం మరీ వేడిగా కానీ, మరీ చల్లగా కానీ లేకుండా చూసుకోవాలి. అప్పుడే నిద్ర బాగా పడుతుంది.