తెలంగాణ

telangana

By

Published : May 5, 2021, 4:26 PM IST

ETV Bharat / sukhibhava

చేతుల శుభ్రతే కొవిడ్​పై రామబాణం

ఈ కొవిడ్ రోజుల్లో సబ్బుతో తరచూ చేతులు కడుక్కోవటమే అన్నింటిలోకి ముఖ్యం. ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినం సందర్భంగా దీని ప్రాముఖ్యం గురించి మరింత తెలుసుకుందాం.

Hand Washing Is Key To Curb The Virus Spread: World Hand Hygiene Day
చేతుల శుభ్రతే కోవిడ్ పై రామబాణం

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విస్తరించిన తరువాత ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం చేతుల పరిశుభ్రత. కొవిడ్ ఉపద్రవంలోనే కాక ఎల్లవేళలా వేళ్లు, అరచేతులు శుభ్రంగా ఉంచుకోవటం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అందువల్ల ఏటా మే 5న "వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే"ను జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా "చేతులను శుభ్రం చేసుకోండి- కొన్ని క్షణాల సమయం కేటాయింపుతో ప్రాణాలు నిలబెట్టండి" అనే నినాదం అందరినీ ఆకర్షిస్తోంది.

కొవిడ్ విజృంభిస్తున్న ఈ సందర్భంలో చేతులు కడుక్కోవటం వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటానికి ఉత్తమ మార్గంగా కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం చేతుల పరిశుభ్రత సగం ఇన్ఫెక్షన్స్​ను ఆపుతోంది. ఆరోగ్య రంగ కార్యకర్తలకు చేతుల పరిశుభ్రత వల్లనే అంటువ్యాధులు ప్రబలటం లేదు. చేతులు శుభ్రపరచుకోవటం ఎంతో సులభం అనిపించినా ఎక్కువ మంది దీనిని పాటించటం లేదు.

  • 25% ఆరోగ్య కేంద్రాల్లో నీరు లభించటం లేదు.
  • 33% ఆరోగ్య కేంద్రాల్లో చేతులు శుభ్రం చేసుకోవటానికి సబ్బులు, ద్రావణాలు అందుబాటులో లేవు.
  • తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో రోగులను చూసుకునే వార్డుల్లో 9% మంది మాత్రమే చేతుల పరిశుభ్రతను పాటిస్తున్నారు.
  • అభివృద్ధి చెందిన ధనిక దేశాల్లోనూ చేతులు శుభ్రపరచుకునే అలవాటు 70% మాత్రమే ఉంది. ఇది ఇంకా పెరగాలి.

సబ్బుతో శుభ్రపరచుకుంటే ఒనగూరే లాభాలు:

  • విరేచనాల ప్రమాదాన్ని 23–40% మేర తగ్గిస్తుంది.
  • రోగ నిరోధక శక్తి తగ్గిన వారిలో విరేచనాల ప్రమాదాన్ని 58% తగ్గిస్తుంది.
  • జలుబు, శ్వాసకోశ సమస్యల నుంచి 16-21% రక్షణ లభిస్తుంది.
  • బడి పిల్లల్లో వాంతులు, విరేచనాల సమస్య తగ్గి 29-57% బడికి హాజరయ్యే దినాల సంఖ్య పెరుగుతుంది.

చేతులు కడుక్కుని ఆహారం తీసుకుంటే రోగకారక క్రిములు కళ్లు, ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి చేరలేవు. క్రిములున్న ఉపరితలాలను ముట్టుకున్నా రోగాలను కలిగించగలవు. దగ్గు, తుమ్ము తరువాత చేతులు శుభ్రం చేసుకోవటం చాలా అవసరం. చేతులను శుభ్రం చేసుకోవటం ఇక్కడ వివరించిన 5 దశల్లో చేసుకోవాలి.

చేతులు శుభ్రపరచుకోవటంలో దశలు
  1. ముందుగా నీటితో చేతులను తడిపి తరువాత సబ్బు రాసుకోవాలి.
  2. నురగ వచ్చే వరకు చేతులను రుద్దాలి. చేతుల వెనుక, వేళ్ల మధ్య, గోళ్ల కింద నురగ వ్యాపించాలి.
  3. 20 సెకన్ల పాటు చేతులను రుద్దుకోవాలి.
  4. కొళాయి కింద చేతులను కడుక్కోవాలి.
  5. చేతులను ఆరబెట్టుకోవాలి.

ఈ క్రమంలో నీటిని ఎక్కువగా వృథా చేయరాదు. చేతులపై క్రిములు పోవటానికి సబ్బుతో కడుక్కోవటమే ఉత్తమ మార్గం. సబ్బు, నీరు దొరకని సందర్భంలో 60% ఆల్కహాల్ కలసిన శానిటైజర్​తో శుభ్రపరచుకోవచ్చు. అయితే చేతులు మురికిగా ఉన్నపుడు శానిటైజర్ వాడితే మలినాలు, రసాయనాలు చేతులపై ఉండిపోతాయి. అందువల్ల సబ్బునీరు అన్ని వేళలా ఉత్తమ పరిశుభ్రతా ద్రావణం.

ABOUT THE AUTHOR

...view details