తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఎంత తిన్నా.. బరువు పెరగొద్దంటే ఇలా చేయండి!

ఆకలేసినా వేయకపోయినా.. అవసరమున్నవీ, లేనివీ తినేస్తాం.. తిన్నాక అవి అరుగుతున్నాయా? ఆ వ్యర్థాలన్నీ పూర్తిగా బయటికి వెళ్తున్నాయా లేదా అనే సంగతి మాత్రం మనకు పట్టదు. ఫలితంగా వేలాడే పొట్ట, ఊబకాయం ఆపై మరెన్నో ఆరోగ్య సమస్యలు. మరి వీటన్నింటికీ చెక్​ పెట్టడానికే మన యోగాలో ఓ చిట్కా ఉంది.. అదే శంఖు ప్రక్షాళన.. అదేంటో చూసి, ఆరోగ్యంగా మారిపోదాం రండి....

get rid of Constipation and get  free motion with simple yoga
ఎంత తిన్నా.. బరువు పెరగొద్దంటే ఇలా చేయండి!

By

Published : Jul 13, 2020, 10:30 AM IST

స్నానం శరీరంపై ఉండే మలినాలను తొలగిస్తుంది. మరి శరీరం లోపలి మలినాలను ఎలా తొలగిస్తాం? జీర్ణసంబంధ సమస్యలు తొలగి.. జీర్ణక్రియ చురుగ్గా ఉండాలంటే శరీరంలోని మలినాలను తొలగించుకోవాలి. అప్పుడే మనసు, శరీరం రెండూ ఉత్సాహంగా ఉంటాయి. దీనికోసం యోగాలో శంఖు ప్రక్షాళన పద్ధతి ఉంది. ఇందులో కేవలం నాలుగే ఆసనాలుంటాయి.

  • ఈ నాలుగు ఆసనాలను క్రమంగా చేయడం వల్ల తాగిన నీళ్లు పొట్టలోంచి చిన్నపేగులకు అక్కడి నుంచి పెద్ద పేగులకు అక్కడి నుంచి మలద్వారం నుంచి కిందికి వచ్చేస్తాయి. అంటే నోటి నుంచి తాగిన నీళ్లు పొట్టలోని భాగాలను శుభ్రం చేస్తూ బయటకు వచ్చేస్తాయి. గోరువెచ్చని నీళ్లు తాగాలి. చన్నీళ్లు తాగి చేయకూడదు. రెండు లీటర్ల నీళ్లు తీసుకుంటే రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి. బీపీ ఉన్నవాళ్లు ఉప్పులేని గోరువెచ్చని నీళ్లు తాగాలి.
  • ఈ నాలుగు ఆసనాలూ కలిపి ఒక్క రౌండుగా భావించాలి. అలా కనీసం ఆరు రౌండ్లు సాధన చేయాలి. ఇలాచేస్తే లోపల ఉన్న విష పదార్థాలన్నీ మలద్వారం నుంచి బయటకు వచ్చేస్తాయి. వీటిని శంఖు ప్రక్షాళన ఆసనాలంటారు. పెద్దపేగు శంఖు ఆకారంలో ఉంటుంది కాబట్టి వీటికా పేరు వచ్చింది. సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకుని రెండు లీటర్ల నీళ్లు తాగి ఈ నాలుగు ఆసనాలు సాధన చేస్తే శరీరం మొత్తం శుభ్రమవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలుండవు. లోపల ఉన్న విష పదార్థాలన్నీ బయటకు వచ్చేస్తాయి.
  • ఈ ఆసనాలు వేసిన రెండు గంటల తర్వాత ఆహారం తీసుకోవాలి. మాంసాహారం, మసాలాలు, కారం లేకుండా కిచిడీ చేసుకుని తినాలి. తాగగలిగిన వాళ్లు మూడు లీటర్ల నీళ్లయినా తాగొచ్చు.

1. సర్పాసనం

సర్పాసనం

బోర్లాపడుకుని రెండు చేతులు ఛాతీ పక్కన పెట్టుకుని రెండు కాలి వేళ్ల మీద శరీరాన్ని పైకి లేపాలి. అంటే మొత్తం శరీరం బరువు చేతులు, కాలివేళ్ల మీద ఉంటుంది. శరీరం మరీపైకి లేవకూడదు. మరీ కిందకు వెళ్లకూడదు. మెల్లగా శ్వాస వదులుతూ తల తిప్పి నడుము, కాళ్లను చూడాలి. మళ్లీ శ్వాస తీసుకుని మధ్యలోకి రావాలి. తిరిగి శ్వాస వదులుతూ ఎడమవైపు చూడాలి. ఇలా పదిసార్లు చేయాలి. చివరిగా యథాస్థితికి వచ్చి మెల్లగా పైకిలేచి నిలబడాలి.

2. కటి చక్రాసనం

2. కటి చక్రాసనం

రెండు కాళ్లు కొంచెం దూరంగా పెట్టి రెండు చేతులను భుజాలకు సమాంతరంగా ముందుకు చాపాలి. శ్వాస వదులుతూ కుడివైపు నడుం, భుజాలు, తలను తిప్పాలి. కాళ్లను మాత్రం కదిలించకూడదు. తర్వాత శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రావాలి. మళ్లీ శ్వాస వదులుతూ ఎడమవైపు తిరగాలి. ఇలా మార్చిమార్చి ఇరవైసార్లు చేయాలి. ఈ ఆసనంలో పైభాగం మాత్రమే పక్కకు తిప్పాలి, కింది భాగం కదలొద్దు.

3. ఊర్ధ్వ హస్తాసనం

ఊర్ధ్వ హస్తాసనం

రెండు పాదాలను దగ్గరకు పెట్టి నిలబడాలి. రెండు చేతి వేళ్లను కలిపి పైకి పెట్టి శ్వాస వదులుతూ కుడివైపు వంగాలి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. మళ్లీ శ్వాస వదులుతూ ఎడమవైపు వంగాలి. ఇలా ఇరవైసార్లు చేయాలి. వెంటనే మరో ఆసనం చేయాలి.

4. ఉదరాకర్షణ ఆసనం

ఉదరాకర్షణ ఆసనం

రెండు కాళ్లను కొద్దిగా దూరంగా ఉంచి కూర్చోవాలి. పిరుదులు నేలను తాకకూడదు. రెండు చేతులను మోకాళ్ల మీద ఉంచి కుడి మోకాలిని కింద పెట్టాలి. ఎడమ మోకాలును పొట్టకు తాకేలా ఉంచి ఎడమవైపు తిరగాలి. మళ్లీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రావాలి. ఇప్పుడు కాలు మార్చాలి కుడి వైపు తిరగాలి. ఇలా ఎడమ వైపు ఒకసారి, కుడివైపు ఒకసారి మార్చి మార్చి చేయాలి. ఇలా చేయడం వల్ల పొట్ట తగ్గుతుంది.

ప్రయోజనాలు: బరువు తగ్గుతుంది. పొట్ట శుభ్రపడటమే కాకుండా బాగా తగ్గుతుంది కూడా. మలబద్ధకం వంటి సమస్యలుంటే తొలగిపోతాయి. ఏడాదికి లేదా ఆరు నెలలకు ఒకసారైనా ఇలా శరీరాన్ని ప్రక్షాళన చేసుకోవచ్చు.

ఇదీ చదవండి:ఈ మొక్కలు మన మనసు మార్చేస్తాయట!

ABOUT THE AUTHOR

...view details