తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కరోనా వేళ... గుండె ఆరోగ్యానికి 5 సూత్రాలు! - Heart health is solidified with those ingredients

గుండె ఆరోగ్యం ప్రాధాన్యాన్ని కొవిడ్‌-19 మరోసారి గుర్తుచేసింది. ఇప్పటికే గుండెజబ్బులు ఉన్నవారిని.. కరోనా జబ్బు దుష్ప్రభావాలు ఎక్కువగా పీడిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా ముప్పు ఇప్పుడప్పుడే తొలగిపోయేది కాదు. టీకా తయారైనా వెంటనే అందరికీ అందుబాటులోకి రావడం కష్టం. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఇందుకోసం మంచి జీవనశైలిని పాటించడం మీద దృష్టి పెట్టడం మంచిది. ఇది పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఆహార, విహార పరంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు..

Five tips to Keep Your Heart Healthy
కరోనా వేళ... గుండె ఆరోగ్యానికి 5 సూత్రాలు!

By

Published : Sep 30, 2020, 6:24 PM IST

పీచు, యాంటీ ఆక్సిడెంట్లు:

తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు మరింత ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, పీచు గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. ఆహారంలో చిలగడ దుంపలు చేర్చుకుంటే మరింత ఎక్కువ పీచు లభించేలా చూసుకోవచ్చు. మోనో అసంతృప్త కొవ్వుతో కూడిన నూనెలతో కూరగాయల్లోని పోషకాలు ఇంకాస్త ఎక్కువగానూ ఒంటపడతాయి.

కోఎంజైమ్‌ క్యూ10:

ఇదో యాంటీఆక్సిడెంట్‌. దీన్ని యుబిక్వినోన్‌ లేదా యుబిక్వినోల్‌ అనీ అంటారు. గుండె ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిజానికి దీన్ని మన శరీరమే సహజంగా తయారుచేసుకుంటుంది. కాకపోతే వయసు మీద పడుతున్నకొద్దీ దీని స్థాయులు తగ్గుతుంటాయి. గుండెజబ్బులతో బాధపడేవారిలో దీని మోతాదులు తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి కోఎంజైమ్‌ క్యూ10 లభించే పిస్తా, గోబీపువ్వు, నారింజపండ్లు, చేపలు తినటం మంచిది.

విటమిన్‌ కె:

గుండెజబ్బు ముప్పు తగ్గడానికి, రక్తప్రసరణ మెరుగుపడడానికి విటమిన్‌ కె ఎంతగానో తోడ్పడుతుంది. రక్తనాళాల్లో కాల్షియం వంటి ఖనిజాలు పోగుపడటాన్నీ తగ్గిస్తుంది. వీటిని రక్తనాళాల నుంచి తిరిగి ఎముకలు, దంతాల్లోకి చేర్చటానికీ ఉపయోగపడుతుంది. అందువల్ల విటమిన్‌ కె లోపం తలెత్తకుండా చూసుకోవాలి. సార్‌డైన్‌ వంటి చేపల్లో విటమిన్‌ కె దండిగా ఉంటుంది. అవసరమైతే డాక్టర్‌ సలహా మేరకు మాత్రల రూపంలో తీసుకోవచ్చు. మనకు రోజుకు 120 మైక్రోగ్రామలు విటమిన్‌ కె అవసరం.

ఏరోబిక్‌ వ్యాయామాలు:

గుండె జబ్బుల నివారణకు నడక, ఈత వంటి ఏరోబిక్‌ వ్యాయామాలు చాలా ముఖ్యం. రోజూ ఒకేరకం వ్యాయామాలతో విసుగు పుట్టకుండా వీటిని మార్చుకోవచ్చు. ఒకరోజు నడిస్తే, మరో రోజు ఈత కొట్టొచ్చు. ఇంకోరోజు సైకిల్‌ తొక్కొచ్చు. బస్కీలు తీయడం, గోడ కుర్చీ వేయడం వంటివీ చేయొచ్చు. ఏదైమైనా టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు ఎక్కువసేపు కూర్చోకుండా చూసుకోవడం అలవాటు చేసుకోవాలి.

ప్రాణాయామం, ధ్యానం:

మానసిక ప్రశాంతతకు తోడ్పడే ఇవి రక్తంలో గ్లూకోజు స్థాయులు మెరుగుపడటానికి, రోగనిరోధకశక్తి పుంజుకోవటానికి, వాపు ప్రక్రియ తగ్గటానికి కూడా తోడ్పడతాయి. ఒత్తిడి తగ్గడానికి దోహదం చేసే ప్రాణాయామం, ధ్యానం వంటి వాటితో గుండెజబ్బు ముప్పు 48% వరకు తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి రోజూ కొంతసేపు ప్రశాంతమైన వాతావరణంలో వీటిని సాధన చేయడం మంచిది.

ABOUT THE AUTHOR

...view details