ఏ జబ్బుతో ఆసుపత్రిలో చేరినా ఇంటికి వెళ్లేటప్పుడు ఏం తినాలి, ఎలాంటి పనులు చేయాలని అడగటం సహజమే. డాక్టర్లు కూడా మందులు వేసుకునే విధానంతో పాటు వీటి గురించీ విధిగా వివరిస్తుంటారు. సాధారణంగా జబ్బుల నుంచి కోలుకున్నాక వీలైనంత త్వరగా పనులు, వ్యాయామాలు ఆరంభించటం మంచిది. శరీర సామర్థ్యాన్ని బట్టి తీవ్రతనూ పెంచుకోవచ్చు. ఇవి త్వరగా కోలుకోవటానికి తోడ్పడతాయి. కొవిడ్-19 విషయంలో అలాంటి పరిస్థితి కనిపించటం లేదు.
కరోనా జబ్బు ఊపిరితిత్తుల మీదే కాదు.. గుండె, మెదడు, రక్తనాళాల వంటి వాటిపైనా విపరీత ప్రభావం చూపుతోంది. జీర్ణకోశాన్ని, రక్తం గడ్డకట్టే ప్రక్రియనూ అస్తవ్యస్తం చేస్తోంది. కొవిడ్ తగ్గిన తర్వాతా ఎంతోమంది నిస్సత్తువ, బలహీనత, ఆయాసం, విరేచనాలు, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, ఆందోళన, ఒత్తిడి వంటి వాటితో బాధపడుతుండటమే దీనికి నిదర్శనం. ఇలాంటి ఇబ్బందులు కొందరిని తీవ్రంగానూ వేధిస్తున్నాయి. దీనికి కారణం వైరస్ ప్రభావమే. మిగతా వైరస్‌లతో పోలిస్తే సార్స్-కోవ్2 భిన్నంగా ప్రవర్తిస్తోంది. ఇన్‌ఫెక్షన్ సోకినా కొందరిలో అసలు లక్షణాలే కనిపించటం లేదు. కొందరిలో మామూలు లక్షణాలకే పరిమితమవుతుండగా.. ఇంకొందరిలో మధ్యస్థ లక్షణాలతో వేధిస్తోంది. కొందరిని మాత్రం ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేస్తోంది. ఇలా ఒకే వైరస్ పలువురిలో పలు రకాలుగా ప్రభావం చూపుతుండటం విచిత్రం.
ఒక మాదిరి, మధ్యస్థ లక్షణాలు గలవారిలోనూ అవయవాలు విపరీత ప్రభావానికి లోనవుతుండటం ఆందోళనకరం. కొందరిలో గుండె కండరం మందం కావటం, బలహీన పడటం చూస్తున్నాం. ఇది గుండె లయ తప్పేలా చేస్తుంది. అరుదుగా గుండెపోటుకూ దారితీయొచ్చు. కొవిడ్ బారినపడటానికి ముందు పూర్తి ఆరోగ్యంతో, మంచి శరీర సామర్థ్యంతో ఉన్నవారిలోనూ ఇలాంటి సమస్యలు కనిపిస్తుండటం గమనార్హం. కొవిడ్ నుంచి కోలుకున్నవారిలో సుమారు 78% మందిలో గుండె కండరం మందమైనట్టు, 15% మందిలో గుండె కండరం బలహీనపడినట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి వ్యాయామాల విషయంలో జాగ్రత్త అవసరం. లేకపోతే కొవిడ్ మూలంగా తలెత్తిన గుండె, రక్తనాళాల సమస్యలు ఉద్ధృతం కావొచ్చు. కాలి సిరల్లో రక్తం గడ్డలు ఏర్పడితే అవి గుండెకు చేరుకోవచ్చు. ఇవి ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు.
జాగ్రత్తగా ఉండాలి
- నిస్సత్తువ, నీరసంగా ఉన్నా.. ఏదో నలతగా ఉన్నట్టు అనిపిస్తున్నా కష్టమైన పనులు, వ్యాయామాలు చేయరాదు.
- ఒక మాదిరి, మధ్యస్థ కొవిడ్ బారినపడ్డవారు లక్షణాలు పూర్తిగా తగ్గిపోయి, వారం గడిచాకే వ్యాయామాలు మొదలెట్టాలి. అదీ నెమ్మదిగానే. అంటే రోజూ 2 కి.మీ. నడిచేవారు కిలోమీటరుకే పరిమితం కావాలి. శరీర సామర్థ్యాన్ని బట్టి క్రమంగా పెంచుకుంటూ రావాలి.
- కొవిడ్ పరీక్ష పాజిటివ్‌గా ఉండి, లక్షణాలేవీ లేనివారు 10 రోజుల తర్వాతే కఠిన వ్యాయామాలు మొదలెట్టాలి.
- తీవ్ర కరోనాతో ఆసుపత్రిలో చేరినవారిలో కొందరు పూర్తిగా కోలుకోవటానికి 3-6 నెలలు పట్టొచ్చు. ఇలాంటివారు లక్షణాలు పూర్తిగా తగ్గాకే, అదీ డాక్టర్ సలహా మేరకే వ్యాయామాలు ఆరంభించాలి. ఈసీజీ, ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తం గడ్డకట్టే తీరును తెలిపే డీడైమర్ పరీక్షలు చేయించుకున్నాకే వీటిని మొదలెట్టాలి.
- ఎవరికైనా వ్యాయామాలు ఆరంభించిన తర్వాత ఛాతీనొప్పి, ఆయాసం, గుండె దడ వంటివి మొదలైతే వెంటనే ఆపెయ్యాలి. ఇలాంటి లక్షణాలుంటే ఎవరైనా సరే.. వయసుతో నిమిత్తం లేకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.