10,000 Steps a Day: ఓ హెల్త్ డివైజ్ ప్రకటన ప్రకారం రోజుకు 10వేల అడుగులు నడిస్తే ఆరోగ్యానికి మంచిదనే ప్రచారం ఊపందుకుంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి నడక మంచిదే. అయితే '10వేల అడుగులు' వేయాలి అనే నియమం.. ఎంతవరకు శాస్త్రీయం అనేది సదరు సంస్థ ఇప్పటివరకు వెల్లడించలేదు. దీనిపై పరిశోధన జరిపిన మసాచుసెట్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాలను తెలిపారు. దాని ప్రకారం..
"నడక ఆరోగ్యానికి మంచిదే. శక్తిని, ఉత్పాదకతను పెంపొందిస్తుంది. అయితే 10వేల అడుగుల రూల్ శాస్త్రీయమనేందుకు ఎలాంటి ఆధారం లేదు" అని వెల్లడించారు పరిశోధకులు.
మరి ఎన్ని అడుగులు వేస్తే మేలు?
"మరింత ఎక్సర్సైజ్ చేస్తే మంచిదే. 5వేల అడుగుల కన్నా 6వేల అడుగులు నడవడం శ్రేయస్కరం. అలాగే 4వేల అడుగుల కన్నా 5వేల అడుగులు వేస్తే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే 10వేల అడుగుల వల్ల ఎలాంటి ప్రత్యేకమైన లాభాలు లేవు. దానికన్నా 7వేల అడుగులతో ముందుగానే చనిపోయే ప్రమాదాన్ని 50 నుంచి 70 శాతం వరకు తగ్గించుకోవచ్చని తేలింది" అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
అయితే అంతమాత్రానా ఎక్కువగా నడవకూడదని కాదు. ఎక్కువ నడిచే కొద్దీ.. మరిన్ని కేలరీలు ఖర్చవుతాయి. తద్వారా బరువు తగ్గవచ్చు. సృజనాత్మకత పెరుగుతుంది. మెదడు చురుకుగా ఉంటుంది. నడవడం ద్వారా ప్రపంచంలోని సౌందర్యాన్నీ ఆస్వాదించవచ్చు. కానీ.. ఆరోగ్యం, బరువు తగ్గడంలో '10,000 అడుగుల' నియమం ఎలాంటి ప్రత్యేక పాత్ర పోషించదని పరిశోధకులు స్పష్టంచేశారు. 7 వేల అడుగులు చాలని చెబుతున్నారు!
ఇదీ చూడండి:10 నిమిషాల పరుగుతో.. 'మూడ్' మారిపోవాల్సిందే!