అసలు చెమట ఎందుకు పడుతుంది..?
- వాతావరణంలో వేడి పెరిగినప్పుడు శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి, చెమట రూపంలో తేమ ఉత్పత్తవుతుంది. అధిక శ్రమకు గురైనప్పుడు శరీరంలో పుట్టే వేడిని అదుపు చేయడానికీ చెమట పడుతుంది.
- కానీ కొందరికి ఏకాస్త శ్రమపడ్డా, రెండు నిమిషాలు వేడి తగిలినా చాలు చెమట వరదలౌతుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. విపరీతమైన చెమట మనం గమనించని ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
- మధుమేహం, గుండె లోపలి పొరలో కలిగిన ఇన్ఫెక్షన్(ఎండో కార్త్డెటిస్), జ్వరం, సాధారణ ఒత్తిడి, గుండె పోటు, హైపర్ హైడ్రాసిస్, హైపర్ థైరాయిడిజం, యాంటీ డిప్రెసెంట్ల వల్ల దుష్ప్రభావాలకు లోనైనప్పుడు, మెనోపాజ్, వూబకాయం..మొదలైన సమస్యలు ఉన్నప్పుడు కూడా విపరీతంగా చెమట పట్టే అవకాశం ఉంది..
- వీటిలో ఏదైనా సరే... అసాధారణమైన చెమటకు కారణం కావచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా డాక్టరును సంప్రదించాలి.
చెమట పడితే చెడు వాసన ఎందుకు..?
మన శరీరంలోని మలినాలు చెమట ద్వారా బయటికి రావడం వల్ల చెమట చెడువాసన కలిగి ఉంటుందని చాలామంది అభిప్రాయం. కానీ అసలు విషయం ఏంటంటే...చర్మం పైన ఉన్న బ్యాక్టీరియా చెమటలోని ప్రొటీన్లను గాఢమైన ఆమ్లాలుగా విడగొట్టడం వల్ల, వాటినుంచి చెడు వాసనలు వస్తాయి. అందుకే చర్మాన్ని తరచూ శుభ్రం చేసుకుంటే చెమట వల్ల వచ్చే దుర్వాసన తగ్గుతుంది. అలాగే శరీరంలోని నీటి శాతాన్ని తగ్గనివ్వకుండా చూసుకోవాలి. డిటాక్సిఫికేషన్ ద్వారా కూడా చెమట వల్ల వచ్చే దుర్గంధాన్ని తగ్గించవచ్చు.
చెమట వాసనను నివారించే మార్గాలు..
వేసవిలో అధికంగా బాధించే చెమట వాసనని నివారించడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
చర్మాన్ని ఇలా శుభ్రపరచుకోవాలి..
1. నిమ్మకాయను రెండు భాగాలుగా తరగాలి. చెమట ఎక్కువగా పట్టేచోట కొద్దిగా పిండుతూ ఆ నిమ్మచెక్కతో రుద్దాలి. ఆరాక వదులైన కాటన్ దుస్తులను ధరిస్తే 16 నుంచి 24 గంటల పాటు చెమట వాసన ఉండదు.
2. రెండు చెంచాల నిమ్మరసాన్ని నాలుగు చెంచాల బేకింగ్ సోడాలో కలిపి, చెమట పట్టేచోట ప్యాక్‌లా వేయాలి. ఆరాక స్క్రబ్ చేస్తూ రుద్ది, నీటితో కడిగేస్తే రోజంతా తాజాగా ఉంటారు.
3. చెమట వాసన ఎక్కువగా ఉండే చోట, రబ్బింగ్ ఆల్కహాల్లో ముంచిన దూదితో శుభ్రంచేస్తే 24 గంటలపాటు శరీర దుర్వాసను అరికట్టవచ్చు.
4. యాపిల్ సిడర్ వెనిగర్ కూడా చెమట వాసనను దూరం చేసేందుకు పనికొస్తుంది. ఇందులో ముంచిన కాటన్‌బాల్ లేదా కాటన్ ప్యాడ్స్‌తో చర్మాన్ని తుడవటం వల్ల చాలాసేపు చెమట వాసన రాకుండా ఉంటుంది.
5. మౌత్ వాష్ లేదా టూత్‌పేస్ట్‌తో చెమట పట్టే ప్రదేశాలను శుభ్రం చేసినా ఫలితం ఉంటుంది. వారానికి మూడు సార్లు ఇలా చేయవచ్చు. నెల రోజుల పాటు ఇలా చేసిన తర్వాత, ఒక నెల రోజుల పాటు ఆపి మళ్లీ ప్రారంభించవచ్చు.. గాఢమైన ఆల్కహాల్, క్లీనింగ్ ఏజెంట్లు చర్మం పైపొరను పొడిబార్చకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
6. టీట్రీ ఆయిల్, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, పెప్పర్మింట్ ఆయిల్... వీటిలో ఏదైనా ఒకదాన్ని స్నానం చేసే నీటిలో ఆరు చుక్కలు కలపాలి. లేదా ఎప్సమ్ బాత్ సాల్ట్‌తో కలిపి స్నానపు తొట్టిలో వేసి అందులో అరగంటపాటు సేద తీరినా.. శరీరం సుగంధాలు వెదజల్లడమే కాదు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
7. ఒక బకెట్ నీటిలో మూడు గ్రీన్‌టీ బ్యాగ్‌లను వేసి ఆ నీటిని నేరుగా స్నానానికి ఉపయోగించినా లేదా స్నానపు తొట్టిలో ఆ నీటిని పోసి, ఇరవై నిముషాల పాటు, అందులో సేదతీరినా శరీర దుర్వాసన పోవడంతో పాటు చర్మం కాంతివంతమవుతుంది.
8. స్నానపు తొట్టిలోని నీటికి రెండు కప్పుల టమాటా రసం చేర్చి, అందులో అరగంట పాటు గడిపినా ఫలితం ఉంటుంది.