తెలంగాణ

telangana

ETV Bharat / sukhibawa

ఉత్కళకు అండగా.. మహిళా మణులుండగా...

కరోనా కోరలు చాస్తే.. బాధితుల సంఖ్య వందలు, వేలు దాటుతుంది. లక్షలను తాకుతుంది. ఈ విషయంలో ఆది నుంచి అప్రమత్తంగా ఉండటంతో ఒడిశాలో ఈ వైరస్‌ పీడితుల సంఖ్య ఇంకా పదుల్లోనే ఉంటోంది. ఉత్కళ ప్రశాంతంగా ఊపిరిపీల్చుకుంటోందంటే అందుకు కారణం ఈ మహిళా అధికారుల బృందం. వైరస్‌ వ్యాప్తి చెందకుండా వారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.

Odisha lady officers working hard to prevent corona virus
ఉత్కళకు అండగా.. మహిళా మణులుండగా...

By

Published : Apr 23, 2020, 3:15 PM IST

Intro:Body:

వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎంత వేగంగా చేస్తే.. కరోనాను అంత త్వరగా కట్టడి చేయొచ్ఛు. ఒడిశా రాష్ట్రం ఈ సూత్రమే పాటిస్తోంది. అందుకే దేశమంతా కరోనా విలయతాండవం చేస్తున్నా ఈ రాష్ట్రంలో వైరస్​ బాధితుల సంఖ్య పదుల సంఖ్యలోనే ఉంది. దానికి కారణం... భువనేశ్వర్‌లోని రీజినల్‌ మెడికల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ సంఘమిత్ర పాటి వ్యాధి నిర్ధారణ పరీక్షలను వేగంగా నిర్వహిస్తున్నారు. రోజుకు ఏడు వందల నుంచి వెయ్యి వరకు పరీక్షలు నిర్వహించేలా కేంద్రాలను పెంచారు. ప్రధాన పరీక్ష కేంద్రంలో ఇరవైనాలుగు గంటలు టెస్ట్‌లు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారామె.

ఆసుపత్రులే కార్యక్షేత్రాలు..

భువనేశ్వర్‌లోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)ను వ్యాధి నిర్ధారణ కేంద్రంగా మార్చారు. డాక్టర్‌ గీతాంజలి బట్మానా నేతృత్వంలో ఇక్కడ పరీక్షలు జరుగుతున్నాయి. కటక్‌లోని ఎస్సీబీ ఆసుపత్రిని టెస్టింగ్‌ సెంటర్‌గా మార్చారు. ఇక్కడి బాధ్యతలు డాక్టర్‌ జయశ్రీ మహంతి చూసుకుంటున్నారు. వేగంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ.. వ్యాధి ప్రబలకుండా జాగ్రత్త పడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించేలా చూడటంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

మందుల కొరత లేకుండా

కరోనా కాలంలో మందుల కొరత లేకుండా కృషి చేస్తున్నారు ఐఏఎస్‌ యామిని సారంగి. ఒడిశా రాష్ట్ర మెడికల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారీమె. వైద్య పరికరాలు, ఔషధాల వినియోగం, సరఫరాపై ఎప్పటికప్పుడూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తొమ్మిది నెలల పాటు ఔషధాలు, అత్యవసర వస్తువులకు కొరత రాకుండా చర్యలు తీసుకున్నారు.

క్షేత్రస్థాయిలో అప్రమత్తత

తీరికలేని సమీక్షలతో కరోనాపై పోరాటం చేస్తున్నారు శాలినీ పండిట్‌. కరోనా నేపథ్యంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న హెల్త్‌ మిషన్‌కు నేతృత్వం వహిస్తున్నారీమె. ప్రజారోగ్యం, పరీక్షలు వంటి విషయాలపై సమావేశాలు నిర్వహిస్తూ.. క్షేత్రస్థాయిలో అధికారులను అనుక్షణం అప్రమత్తం చేస్తున్నారు.

అంకితభావంతో..

లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు చేస్తున్నారు గజపతి జిల్లా ఎస్పీ సారా శర్మ. మరోవైపు కరోనాపై అవగాహన కల్పించేలా పాటలు రాస్తున్నారు. కరోనాను అనుకోని అతిథిగా అభివర్ణిస్తూ.. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే.. ఆ అతిథి వెళ్లిపోతుందంటూ గేయాలు రాసి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. ఈమె పాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. గ్రామగ్రామానా అవి మార్మోగుతుండటం వల్ల సారాశర్మ స్వరం ఒడిశా ప్రజలందరికీ సుపరిచితమైపోయింది.

ABOUT THE AUTHOR

...view details