Yadadri maha samprokshanam : ఉగాదికి ముందే స్వయంభువుల దర్శనాలకు తెరలేపే మహాక్రతువు నిర్వహణకు యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రం సంసిద్ధమవుతోంది. అందుకు అవసరమయ్యే సంప్రదాయ వనరుల కల్పనపై దిశానిర్దేశం చేసేందుకు...సీఎం కేసీఆర్ త్వరలోనే యాదాద్రికి వెళ్లనున్నారు. ప్రధానాలయ ప్రారంభోత్సవం క్రతువు నిర్వహణపై ఆదివారమే చినజీయర్ స్వామిని సీఎం కలిశారు.
ఏర్పాట్లు ముమ్మరం
మార్చి 28న జరిపే మహా సంప్రోక్షణకు ముందస్తుగా.. శ్రీ సుదర్శన మహాయాగం నిర్వహిస్తారు. ఆ మహాయాగానికి సేకరించిన సుమారు వందెకరాల్లో.... 1,008 కుండాలు, పర్ణశాలలు, మహాపర్ణశాల ఏర్పాట్లకు యాడా సిద్ధమవుతోంది. ఇప్పటికే నెయ్యి సేకరణకు టెండర్ నిర్వహించారు.
మహా సంప్రోక్షణకు సిద్ధమవుతున్న యాదాద్రి.. నిర్మాణ పనులు వేగవంతం
మరోవైపు నిర్మాణాలు వేగవంతం చేస్తున్నారు. గర్భాలయానికి స్వర్ణ ద్వారాల బిగింపు పనులు పూర్తయ్యాయి. 37అడుగుల ఎత్తున్న ధ్వజస్తంభానికి స్వర్ణ తొడుగుల పనులు కొనసాగుతున్నాయి. బలిపీఠానికి బంగారు కవచాల బిగింపు జరగాల్సి ఉంది. పడమటి దిశలో దర్పణాన్ని అమర్చారు. ఆలయం చుట్టూ నిర్మితమైన అష్టభుజ మండప ప్రాకారాల్లోని సాలహారాల్లో... అష్టదిక్పాలకుల శిల్పరూపాలు పొందుపరచాల్సి ఉంది. దివ్య విమానాన్ని స్వర్ణమయం చేసేందుకు బంగారం సేకరణ కొనసాగుతోంది. బంగారు వర్ణంలో దర్శన, వరుసలను తీర్చిదిద్దారు. ఇకపోతే విద్యుదీకరణ పనులు పూర్తి కావొచ్చాయి.
ఉత్తర ద్వార దర్శనం
Yadadri temple: మరోవైపు యాదాద్రి పుణ్యక్షేత్రంలోని బాలాలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారదర్శనం కల్పించాలని దేవస్థానం నిర్ణయించింది. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ ఉత్తర ద్వారదర్శనం కల్పిస్తామని యాదాద్రి ఆలయ ఈవో గీత గురువారం తెలిపారు. వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి రోజు నుంచి ఆరు రోజులపాటు బాలాలయంలో వార్షిక అధ్యయనోత్సవాలు మొదలవుతాయి. ఈ సందర్భంగా శ్రీసుదర్శన హోమం, శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణోత్సవాలను నిలిపివేయనున్నట్లు ఈవో వివరించారు.
గండి చెరువు పనులు వేగవంతం
Gandi cheruvu in yadadri : యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహస్వామి నిత్య కైంకర్యాలకు, భక్తుల పవిత్ర స్నానాలకు, భవిష్యత్తులో పుష్కరాల నిర్వహణకు వీలుగా పుణ్య గోదావరి గలగలమంటూ తరలివస్తోంది. నదీ తీరంలోని పుణ్యక్షేత్రాలను తలపించేలా యాదాద్రిని తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కలకు అనుగుణంగా గండి చెరువు సిద్ధమవుతోంది. అందులో భాగంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గండిచెరువులోకి చేర్చే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. యాదాద్రికి వచ్చే భక్తుల పుణ్యస్నానాలకు వీలుగా కొండ కింద గండి చెరువు చెంత లక్ష్మీ పుష్కరిణి, కొండపైన స్వామి వారి కైంకర్యాల కోసం విష్ణు పుష్కరిణి నిర్మించిన విషయం తెలిసింది. వీటికి నిరంతరం నీరందించేలా గండి చెరువును రూ.33 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో నీటినిల్వ సామర్థ్యం పెంచడానికి వీలుగా ఎనిమిది మీటర్లలోతు పూడికతీస్తూ చుట్టూ రక్షణ గోడ(రిటైనింగ్ వాల్) నిర్మిస్తున్నారు. రక్షణ గోడ, వలయ రహదారి మధ్యలో ఆహ్లాదాన్ని పంచేలా ఉద్యానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. చెరువులో మురుగు, వర్షాల తాలూకు వరద జలాలు కలవకుండా ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేస్తున్నారు. మూడు నెలలకోసారి కాళేశ్వరం జలాలు నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే చెరువు నీరు బయటికి వెళ్లేలా మూడు మీటర్ల ఎత్తులో తూము(అప్‌టైన్ స్లూయిజ్) నిర్మిస్తున్నారు. ‘సైదాపూర్ కాల్వ నుంచి గండి చెరువులోకి గోదారి జలాలను తీసుకొచ్చే పైపులైన్ పనులు మొదలయ్యాయి. గండి చెరువులో ఎప్పుడూ పరిశుభ్రమైన నీళ్లే ఉండేలా నిర్మాణాన్ని తీర్చిదిద్దుతున్నాం. మార్చి 28న జరిగే ప్రధానాలయ మహాకుంభ సంప్రోక్షణకు ముందే అన్ని పనులు పూర్తిచేస్తాం’ అని ఆర్‌అండ్‌బీ డీఈఈ బీల్యానాయక్ తెలిపారు.
ఇదీ చదవండి:తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం