Problems in Tandas in Munugode Constituency: గుట్టల మధ్య ఆవాసాలు ఇళ్ల మధ్య మట్టి రోడ్లు సరైన వైద్యం అందని జనం సదుపాయాలకు దూరంగా గ్రామం. ఇదీ మునుగోడు నియోజకవర్గంలో గ్రామపంచాయతీలుగా మారిన తండాల పరిస్థితి. పంచాయతీలుగా మారిన తండాలు అభివృద్ధి నోచుకోక కష్టాల్లో కాలం గడుపుతున్నాయి. తండాలను పంచాయతీలుగా మారిస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుందనుకున్న జనానికి నిరాశ తప్పడంలేదు. 2018 మార్చి 28న తీసుకొచ్చిన చట్టంప్రకారం 17 77 తండాలను తెరాస సర్కార్ గ్రామపంచాయతీలుగా మార్చింది.
ఇందులో భాగంగా మునుగోడు నియోజకవర్గం నారాయణపురం మండలంలో 11 తండాలు, మర్రిగూడెంలో ఒకటి, నాంపల్లిలో 5 తండాలు పంచాయతీలుగా మారాయి. అభివృద్ధిని చూస్తామని ఆశతో ఉన్న జనానికి.. సదుపాయాలు కనిపించకపోగా కష్టాల్లోనే బతుకు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మునుగోడు నియోజకవర్గంలో గ్రామపంచాయతీలుగా మారినా సీత్యాతండా, వాచ్యతండాల్లో సరైన రోడ్లు, వైద్య సదుపాయాలు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
అనేక కష్టాలు పడాల్సి వస్తోంది: ఏదైనా ప్రమాదం జరిగినా, పాముకాటుకు గురైనా ఆస్పత్రి తీసుకెళ్లాలంటే అనేక కష్టాలు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. మురుగునీటి వ్యవస్థ లేక నిత్యం రోగాల బారిన పడుతున్నా వారిని పట్టించుకునే నాధుడే కరవుయ్యాడు. దివ్యాంగులకు పింఛన్లు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునుగోడులో ఉపఎన్నిక వేళ పార్టీల నేతలు తండాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని రాత పూర్వకంగా హామీ ఇచ్చిన అభ్యర్థికే ఓటు వేస్తామని తండావాసులు అంటున్నారు.