తెలంగాణ

telangana

By

Published : Dec 14, 2020, 5:31 PM IST

ETV Bharat / state

న్యాయం చేయమన్నందుకు లంచం అడిగిన పోలీసు అధికారి!

ఏదైనా ఆపదలో ఉన్నామంటే రక్షణ కల్పిస్తారనే ధీమాతో పోలీసులను ఆశ్రయిస్తాం.. కానీ ఆ పోలీసులే సమస్యగా మారితే? కేసు నమోదు చేసుకుని న్యాయం చేయాల్సిన పోలీసు అధికారి.. న్యాయం జరగాలంటే డబ్బు ఖర్చవుతుంది.. సిద్ధం చేసుకోండి అంటున్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఆ అధికారి ఫోన్‌ చేసి లంచం అడిగిన సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ రైతు చేదు అనుభవం ఇది!

asi demands for bribe in gundala police station
న్యాయం చేయమన్నందుకు లంచం అడిగిన పోలీసు అధికారి!

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో పోలీసుల అవినీతి, పనితనం మరోసారి బయటపడింది. బోరు బావి పంచాయితీలో సొంత అన్నదమ్ముల చేతిలో దెబ్బలు తిన్న వస్త కొండూరు గ్రామానికి చెందిన మట్టగజం యాకయ్య అనే రైతు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. బాగా దెబ్బలు తగిలాయని యాకయ్యని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మరుసటి రోజు అతనికి ఫోన్‌ చేసి దెబ్బలు బాగా తగలడంతో ప్రత్యర్థులపై కేసు నమోదు చేయాలని.. అందుకు అన్ని ఖర్చుల కింద రూ. ఆరువేలు ఇవ్వాలని ఏఎస్‌ఐ భిక్షమయ్య గౌడ్‌ అడిగాడు. దీంతో ఏం చేయాలో తోచక పోలీసు ఉన్నతాధికారులకు చేరవేసేందుకు ఆ సంభాషణని వాట్సాప్‌లో ఉంచాడు. ప్రస్తుతం ఆ ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

అసలేం జరిగింది

గ్రామానికి చెందిన మట్టగజం యాకయ్య, అంజయ్య, రమేష్‌ అనే ముగ్గురు అన్నదమ్ములకు వారివారి పొలాల్లో సొంతంగా బోరు బావులు ఉన్నాయి. అంతే కాకుండా ముగ్గురికీ ఉమ్మడిగా మరో బోరు బావి ఉంది. అవసరాల కోసం యాకయ్య ఉమ్మడి బోరుబావి నీటిని వాడుకుంటున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఈ విషయమై అన్నదమ్ముల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఆ ఘర్షణలో యాకయ్యపై మిగతా ఇద్దరు దాడి చేశారు. వారిపై యాకయ్య పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు.

కేసు పరిష్కారం కావాలంటే ఖర్చవుతుందని ఏఎస్‌ఐ చెప్పడంతో దిక్కు తోచని స్థితిలో వాట్సాప్‌ ద్వారా ఆ సంభాషణని యాకయ్య పంచుకున్నాడు. ఈ నెల 4న అదే పోలీసు స్టేషన్‌లో ఎస్సై రూ.40 వేలు లంచం అడిగిన కేసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆ ఎస్సైని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మరువకముందే అదే స్టేషన్‌లో ఓ పోలీసు అధికారి ఖర్చులకు డబ్బులు అడిగాడు. పోలీసుల తీరుతో మండలంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details