రైతు బంధు పథకం ద్వారా ప్రభుత్వం ఎకరాకు రూ.5 వేల చొప్పున అందిస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన కొద్ది రోజులకు కొంత మంది ఖాతాల్లో సాయాన్ని జమచేయడంతో అన్నదాతలు ఆనందపడ్డారు. ఆ సంతోషం కొందరికే పరిమితమైంది. వరంగల్ అర్బన్ జిల్లాలో చాలా మందికి అందలేదు. ఎప్పుడొస్తాయని ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ ఆరంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా నేటికీ బ్యాంకు ఖాతాల్లో జమకాలేదు. దీంతో రైతన్నలు తరచూ బ్యాంకులకు వెళ్లి ఖాతాలు తనిఖీ చేసుకుంటున్నారు.
రైతులకు ఇదో సమస్య
సకాలంలో వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇదో సమస్యగా మారింది. వ్యవసాయశాఖ అధికారులు రైతుబంధు పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతుల వివరాలు, ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. జూన్ నుంచే నగదు జమ చేస్తూ వచ్చారు. అయితే సాంకేతిక కారణాల వల్ల జమ కావడం నిలిచిపోయింది.