ఉమ్మడి ఓరుగల్లు మున్సిపాలిటీల్లో నవశకం.. ఉమ్మడి వరంగల్‌లో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. తొమ్మిది పురపాలికల్లో పాగా వేసేందుకు...పార్టీలు ప్రచార బరిలో జోరు పెంచాయి. ఐతే తొమ్మిది మున్సిపాలిటీలతో నవపోరుగా మారిన ఉమ్మడి వరంగల్‌లో ఒకనాడు ఒకే పురపాలిక ఉండేది. అది కూడా ఓరుగల్లు పురపాలిక మాత్రమే. 1953 వరకూ ఇదొక్కటే పట్టణ స్థానిక సంస్ధ. 1953లో జనగామ పట్టణం, మున్సిపల్ పాలనకిందకు చేరింది. జనాభా, ఇతరత్రా సదుపాయాలు పెరగడంతో...మేజర్ గ్రామ పంచాయతీలను పురపాలికలుగా ప్రకటించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా విభజనకు పూర్వమే భూపాలపల్లి, మహబూబాబాద్, పరకాల, నర్సంపేట పట్టణాలు మున్సిపాలిటీలుగా ఆవిర్భవించాయి.
కొత్త మున్సిపాలిటీల్లో ఎన్నికల జాతర
గతేడాది పట్టణీకరణ విస్తృతం చేసేందుకు సర్కార్... కొత్త మున్సిపాల్టీలను ఏర్పాటు చేయడంతో మహబూబాబాద్ జిల్లాలోని... తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌తో పాటు వరంగల్ గ్రామీణ జిల్లాలోని వర్థన్నపేట పురపాలికలు ఏర్పడ్డాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వారీగా చూస్తే... వరంగల్ గ్రామీణ జిల్లాలో పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబూబాద్ జిల్లాలో మహబూబూబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీలుగా ఆవిర్భవించాయి. జనగామ జిల్లాలో జనగామ, భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి పురపాలికలుగా అవతరించాయి.
కళ్యాణి చాళక్యుల రాజధాని జనగామ
జనగామ ఒకప్పుడు కళ్యాణి చాళుక్యుల రాజధానిగా ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. 1952 వరకు టౌన్ కమిటీ ఆధ్వర్యంలోనే పురపాలన జరిగింది. 1953 అక్టోబర్ 1న జనగామ.. మున్సిపాలిటీగా అవతరించింది. మూడో శ్రేణి నుంచి మధ్యలో ఒక పర్యాయం నగర పంచాయితీగా మెట్టు దిగినా... తిరిగి పుంజుకొని ఇప్పుడు రెండో శ్రేణి పురపాలికగా ఉంది. తొలి కౌన్సిల్‌లో ఏడు వార్డులుండగా ఇప్పుడు 30 వార్డులయ్యాయి.
నేడు బీ గ్రేడ్ పురపాలక సంఘంగా ఉన్న మహబూబాబాద్...దశాబ్దాకాలంపాటు టౌన్ మున్సిపాలిటీగానే కొనసాగింది. ఆతర్వాత 20 వార్డులతో మేజర్ గ్రామపంచాయతీగా మారింది. 2011 సెప్టెంబర్ 3న 28 వార్డులతో ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా ఏర్పడింది. తాజా వార్డుల విభజనతో 36 వార్డులకు విస్తరించింది. ఇక భూపాలపల్లి విషయానికొస్తే... భూపాలపల్లి 1982 నుంచి గ్రామ పంచాయతీగా ఉంది. 2012 జనవరి 21న 20 వార్డులతో నగర పంచాయతీగా ఏర్పడింది. 2018లో గ్రేడ్-2 మున్సిపాలిటీగా అవతరించింది. తాజాగా 30 వార్డులు ఇందులో కలిశాయి.
వరంగల్ గ్రామీణ జిల్లాలోని వర్థన్నపేట 14 వార్డులతో గ్రామ పంచాయతీగా ఉంటే... పట్టణీకరణ పెరగడంతో... ఆగస్టు 2, 2018న పురపాలికగా ఏర్పడింది. ప్రస్తుతం 12 వార్డులతో చిన్న మునిసిపాలిటీగా ఉంది. మహబూబూబాద్ జిల్లాలో 20 వార్డులతో పెద్ద పంచాయతీగా ఉన్న మరిపెడ ఆగస్టు 2, 2018న పురపాలికగా ఏర్పడింది. ప్రస్తుతం 15 వార్డులు ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ 1956లో వరకూ టౌన్ మున్సిపాలిటీ. జనాభా పెరగడంతో 2018 ఆగస్టు 2న పురపాలికగా 15 వార్డులతో ఏర్పాటు చేశారు. 20 వార్డులతో మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న తొర్రూరును ఆగస్టు 2 2018న పురపాలికగా ఏర్పాటు చేశారు. 16 వార్డుల్లో 25 వేలకు మందికిపైగా జనాభా ఉన్నారు. 1965 నుంచి 2011 వరకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న పరకాల 1956లో టౌన్ మున్సిపాలిటీగా కొనసాగింది. 2011లో నగర పంచాయితీగా ఏర్పడింది. అప్పుడు 20 వార్డులుగా 2018లో పురపాలక సంఘంగా మారింది. ఇప్పుడు 22 వార్డులు అయ్యాయి. 1952 నుంచి గ్రామ పంచాయితీగా ఉన్న నర్సంపేట ...2011 సెప్టెంబర్‌లో 20 వార్డులతో నగర పంచాయతీగా ఎదిగింది. 2018లో పురపాలిక సంఘంగా మారింది. ప్రస్తుతం 24 వార్డులున్నాయి.
ఇవీ చూడండి: నేటితో ముగియనున్న పురఎన్నికల నామినేషన్ల ప్రక్రియ