తెలంగాణ

telangana

విదేశం.. ఆలయాల సందేశం!

By

Published : Sep 26, 2020, 11:41 AM IST

కాకతీయుల నాటి అద్భుత కట్టడాలెన్నో కనుమరుగవుతున్నాయి. వందలు, వేల ఏళ్లనాటి గుళ్లు నిరాదరణకు గురవుతున్నాయి. మన కట్టడాలను పోలిన కొన్ని ఆలయాలు విదేశాల్లో ఉన్నాయి. వాటిని అక్కడి ప్రభుత్వాలు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాయి. చారిత్రక కట్టడాలను రక్షిస్తూ వారి ప్రాచీన సంపదను కాపాడుకుంటున్నాయి.

oldest temples in warangal
విదేశం.. ఆలయాల సందేశం!

మన దేవుని గుట్ట లాంటిదే

సరిగ్గా ఏడాది క్రితం యునెస్కో ప్రతినిధి వాసు పోష్యనందన రామప్ప ఆలయాన్ని పరిశీలించేందుకు వచ్చారు. రామప్ప గుడిని చూశాక, వరంగల్‌ తిరిగొస్తున్న క్రమంలో ములుగు వద్దనున్న దేవుని గుట్ట గుడిని సందర్శించారు. కాకతీయుల కట్టడాలకన్నా ముందు నిర్మించిన దేవుని గుట్టను చూసి ఆయన అబ్బురపడ్డారు. ఇదీ వారసత్వ కట్టడాల పోటీకి పనికొస్తుందని అన్నారు. అంతటి గొప్ప ఆలయం మాత్రం ఇటు కేంద్ర పురావస్తు పరిరక్షణలో గానీ, అటు రాష్ట్ర పరిరక్షణలో గానీ లేదు. ఇలాంటి ప్రాచీన ఆలయం ఒకటి 2016లో థాయ్‌లాండ్‌ అడవుల్లో వెలుగులోకి రాగా అక్కడి ప్రభుత్వం, ఔత్సాహికులు దాన్ని పునరుద్ధరించే పనులు మొదలుపెట్టారు. అవి పూర్తయ్యే దశకు చేరాయి.

ములుగు వద్ద నిరాదరణకు గురవుతున్న దేవునిగుట్ట

వందలాది గుళ్ల సమూహం

కాకతీయులు నిర్మించిన అద్భుతం వేయిస్తంభాల గుడి. దీని కల్యాణమండపం పునర్నిర్మాణం 2006లో ప్రారంభించారు. 14 ఏళ్లు గడిచినా కట్టడం పూర్తి కాలేదు. దీనిపై కేంద్ర పురావస్తు శాఖ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇండోనేషియాలోని జావా ప్రాంతంలో 11 వందల ఏళ్ల నాటి ప్రంబనన్‌ అనే అద్భుత శివాలయం ఒకటుంది. రాతి కట్టడమైన ఈ ఆలయం 200 చిన్న గుళ్ల సమూహం. ఈ ప్రాంతంలో సంభవించే భూకంపాల ధాటికి వీటిలో చాలా గుళ్లు శిథిలమయ్యాయి. 1918 నుంచి ఆలయాలను పునరుద్ధరిస్తున్నారు. 2006లోనూ మళ్లీ భూకంపం వచ్చినా మళ్లీ ఆలయాలను బాగు చేసి పూర్వ వైభవం తెచ్చారు. ఇందులో లభ్యమైన ఒక శాసనం ఆధారంగా గత ఏడాది నవంబరు 12న ఆలయంలో వైభవంగా అభిషేకాలు చేసి పెద్ద వేడుక చేశారు.

థాయ్‌లాండ్‌లో పునర్నిర్మాణం జరుగుతున్న కట్టడం

అన్నీ దెబ్బతిన్నా

నేపాల్‌ మనకన్నా చాలా చిన్న దేశం. ఎన్నో అద్భుత చారిత్రక ఆలయాలకు నెలవు. 2015లో ఆ దేశంలో వచ్చిన తీవ్ర భూకంపాలకు వేలాది మంది మనుషులు ప్రాణాలు కోల్పోయారు. లెక్కకు మించి ఇళ్లు నేలమట్టమయ్యాయి. సుమారు 700 ఆలయాలు దెబ్బతిన్నాయి. అక్కడి వారికి చారిత్రక సంపద మీద ఎంతో ప్రేమ. అందుకే ఆలయాల పునరుద్ధరణ చేపడుతున్నారు. మన ఉమ్మడి వరంగల్‌లో మాత్రం శిథిలావస్థకు చేరిన ఆలయాల వైపు మళ్లీ ప్రభుత్వాలు కన్నెత్తి చూడడం లేదు. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని రామప్ప ఆలయ ప్రహరీ 2017లో వర్షాల వల్ల కూలిపోయింది. మూడేళ్లయినా ప్రహరీ నిర్మాణం పూర్తి కాలేదు. ఈ ఆలయం యునెస్కో పోటీలో ఉన్నా కేంద్ర పురావస్తు శాఖ పనులు పూర్తి చేయడం లేదు.

వేయిస్తంభాల ఆలయం కల్యాణమండపం
ఇండోనేషియాలో ప్రంబనన్‌ శివాలయం
అసంపూర్తిగా రామప్ప ఆలయ ప్రహరీ

మరెన్నో మరుగున

ఉమ్మడి వరంగల్‌ ప్రాంతంలో కాకతీయుల హయాంతోపాటు, ఇతర రాజుల కాలంలో కట్టిన ఎన్నో ఆలయాలకు, కట్టడాలకు రక్షణ లేకుండా పోతోంది. ఇటు కేంద్ర పురావస్తు శాఖకు అప్పగించడం గానీ, అటు రాష్ట్ర పురావస్తు శాఖ గానీ దృష్టిసారించడం లేదు. భూపాలపల్లి జిల్లాలోని కోటగుళ్లు, వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలంలోని ముప్పారం వద్ద ముప్పిరినాథ (త్రికూటాలయం), జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని త్రికూటాలయం, రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచర్ల వద్ద ఏకవీరా ఆలయం ఆదరణను కోల్పోతున్నాయి.

గీసుకొండ మండలం మొగిలిచర్లలో శిథిలావస్థలో ఉన్న ఏకవీర ఆలయం
నేపాల్‌లో పునరుద్ధరిస్తున్న ఆలయం
ధర్మసాగర్‌ మండలం ముప్పారంలోని త్రికూటాలయం

ఇవీచూడండి :అయోధ్యకు భారీ గంట.. జోగులాంబలో ప్రత్యేక పూజలు

ABOUT THE AUTHOR

...view details