Strange theft in Bollikunta, Warangal district: పక్కా పథకంతో బంగారు ఆభరణాలను చోరీ చేశారు.. వారం తర్వాత ఎందుకో దొంగలు మనసు మార్చుకున్నారు. పోలీసులు దొరికిపోతామెమోనన్న భయమో.. లేక మరేదో కానీ దొంగలించిన మొత్తంలోంచి కొంత బంగారంను తీసుకుని మిగతాదంతా బాధితుల ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయారు.
ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలో వారం రోజుల క్రితం చోరీ జరిగింది. 30 తులాల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో డాగ్ స్క్వాడ్ సహాయంతో చోరీ జరిగిన పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వేలిముద్రలను సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈలోపు అనూహ్యంగా పోయిన బంగారం దొరికింది.
దొంగలు బాధితుల ఇంటి ప్రహరీ గోడ వద్ద బంగారం విడిచిపెట్టి వెళ్లిపోయారు. పోయిన బంగారం దొరికిందని బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసు శాఖ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కానీ 30 తులాల బంగారం చోరీకి గురైతే.. వచ్చింది మాత్రం 27 తులాలే ఉన్నాయని బాధితులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేసి దొంగలను పట్టుకుని మిగిలిన 3 తులాల బంగారాన్ని ఇప్పించాలని వేడుకుంటున్నారు.