పురపాలక ఎన్నికల కోసం వికారాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుతాయని తెలిపారు.
జిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నాలుగు పురపాలక సంఘాలున్నాయి. ఈ ఎన్నికల్లో 1,42,925 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 71,348 మంది, మహిళలు 71,576 మంది ఓటర్లు ఉన్నారు. 97 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా వీటిలో రెండు వార్డులు ఏకగ్రీవం కాగా... మిగిలిన 95 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. పురపాలక ఎన్నికల్లో 361 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
సర్వం సన్నద్ధం
నాలుగు పురపాలక సంఘాల్లో కలిపి 224 పోలింగ్ స్టేషన్లు ఉండగా...అందుకు1,195 మంది పోలింగ్ సిబ్బందిని ఎన్నికల కోసం వినియోగిస్తున్నారు. 29 మంది నోడల్ అధికారులను కేటాయించారు. పురపాలక సంఘ ఎన్నికల్లో 62 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇంటర్ నెట్ సౌకర్యం లేని పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ చేస్తున్నామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీగా పోలీసు బందోబస్తును వినియోగిస్తున్నారు. మొత్తంగా ఎన్నికల్లో 667 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారు.
వికారాబాద్ మున్సిపాలిటీలో
వికారాబాద్ పురపాలక సంఘంలో 34 వార్డుల్లో 52,450 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 26, 290 మంది పురుషులు, 26,160 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ పురపాలక సంఘంలో రెండు వార్డులు ఏకగ్రీవం కావడం వల్ల 32 వార్డుల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల కోసం 64 పోలింగ్ కేంద్రాలు..18 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు 28 వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు.