ఎన్నికల్లో ధన ప్రభావం తగ్గించేందుకు అన్ని చర్యలు చేపట్టామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. అధికారులతోపాటు పార్టీలు, నేతలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. పెద్దపల్లి పురపాలికలో డబ్బు పంపిణీ చేస్తుండగా వీడియో తీసి సాక్ష్యం అందించారని... ఇటువంటి చర్యలతో ఎన్నికల అధికారులకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆ వీడియోతో డబ్బు పంపిణీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఎన్నికల ఖర్చులో తప్పుడు లెక్కలు చూపిస్తే అభ్యర్థుల ఎన్నికను రద్దు చేస్తామని హెచ్చరించారు.
పోటీ చేసే అభ్యర్థి వివరాలను నోటీసు బోర్డులో ఉంచుతున్నామని... అభ్యర్థుల గత చరిత్ర, ఆస్తులు, నేరచరిత్ర వివరాలు అందుబాటులో ఉంచుతామని నాగిరెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. దొంగ ఓట్లు పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టెండర్ ఓటు ఒక్కటి పడినా... ఆ ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.టెండర్ ఓటు వేసిన చోట ఓట్ల లెక్కింపు జరగనివ్వమన్నారు. అధికారుల తనిఖీల్లో రూ.44 లక్షల41వేల 858 నగదు, రూ.16 లక్షలు విలువచేసే ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: 'పుర'పోరుకు "పాలమూరు" సన్నద్ధం