Deforestation in Damagundam Forest: వృక్షో రక్షిత రక్షితః.. ఉన్నతాధికారులకు, నాయకులకు.. అటవీ అధికారులు మొక్కలను బొకేల రూపంలో బహుకరించడం చూస్తూనే ఉంటాం. ఇలా చెట్లను పెంచాలని చెప్పే అధికారులే.. మరో వైపు గుట్టు చప్పుడు కాకుండా చెట్లను నరికేందుకు సహకరిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని దామగుండం అటవీ ప్రాంతం.. అనంతగిరి అటవీ ప్రాంతానికి ఆనుకొని దాదాపు 3000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడి అటవీ ప్రాంతంలో కందకం పేరుతో జేసీబీల సహాయంతో పెద్దపెద్ద చెట్లను గుట్టు చప్పుడు కాకుండా తొలగిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ పరిరక్షణ సమితి సభ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాధారణంగా గ్రామాల శివారులోని అటవీ ప్రాంతాల్లో కందకాలు చేపడతారు. కానీ ఇక్కడ అడవి లోపల కందకాలు తవ్వుతున్నారు.
భారీ చెట్లను నరికి కందకాలు తవ్విన అధికారులు వారి కనుసన్నల్లోనే
అడవిని కాపాడాల్సిన అటవీ శాఖ అధికారుల కనుసన్నల్లోనే భారీ చెట్లు నేలకూలుతున్నాయని అటవీ పరిరక్షణ సమితి సభ్యులు ఆరోపించారు. చెట్లను నరికేందుకు అనుమతులు ఉన్నాయని చెప్పి లారీలోడ్లు పంపిస్తునట్లు చెబుతున్నారు. కందకం పేరుతో తవ్వకాలు జరుపుతూ ఏళ్ల తరబడిన చెట్లను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జేసీబీల సాయంతో పెద్ద పెద్ద చెట్లను నరికివేస్తున్నారు. స్థానికులకు తెలియకుండా వాటిపై మట్టి కప్పుతున్నారు. అటవీ అధికారులే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ స్థలాన్ని నేవీకి అప్పగించాలనే ఉద్దేశంతో ఇక్కడ చెట్లు లేవని నమ్మించేందుకు కొన్ని కొన్ని చెట్లను నరికివేస్తున్నారు. 40- 50 అడుగులు ఉన్న చెట్లను విచ్చలవిడిగా నరికేశారు. ఓ వైపు ఇదే అటవీ అధికారులు.. చెట్లను పెంచాలని మళ్లీ కలెక్టర్కు మొక్కలు కానుకగా ఇస్తున్నారు. ప్రభుత్వం, అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి మళ్లీ ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. -- అటవీ పరిరక్షణ సమితి సభ్యులు
స్టేటస్ కో ఎత్తేశాక
ప్రహరీ గోడ పేరుతో ఏళ్ల తరబడిన చెట్ల నరికివేత గతంలో సమితి సభ్యులు స్టేటస్ కో ద్వారా అడవిలోని చెట్లను, జంతువులను కాపాడగలిగారు. స్టేటస్ కో ఎత్తి వేయడంతో మళ్లీ అటవీ అధికారులు అక్రమాలకు తెరలేపారని అటవీ పరిరక్షణ సమితి సభ్యులు ఆరోపించారు. అడవిని కాపాడేందుకు కందకం తవ్వుతున్నామంటూ భారీ చెట్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వ అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించాలని చెట్లను తొలగించవద్దని విజ్ఞప్తి చేశారు. అటవీ శాఖ అధికారులు ఈ భూమిని నేవీకి అప్పగించేందుకు.. ఇక్కడ చెట్లు లేకుండా చేస్తున్నారని.. స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
అటవీ పరిరక్షణ సమితి సభ్యుల బృందం ఇదీ చదవండి:కేసీఆర్కు సంజయ్ లేఖ.. ఎరువులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్