'అభివృద్ధిలోనే కాదు.. విద్యలోనూ ముందుంచారు'
సిద్దిపేట జిల్లాలోని విద్యార్థులు ఉపాధ్యాయులు సైన్స్ ఎగ్జిబిషన్లో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఏడు అవార్డులు సాధించడం అభినందనీయమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో విజేతలకు నగదు బహుమతితో సత్కరించారు.
సిద్దిపేట జిల్లాను అభివృద్ధిలోనే కాదు.. విద్యలోనూ ముందుంచారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. జాతీయ, రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో సిద్దిపేట జిల్లాకు ఏడు అవార్డులు రావడం ఆనందకరమైన విషయమని విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.
సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్, డీఈఓ రవికాంత్ సమక్షంలో విజేతలైన విద్యార్థులు, ఉపాధ్యాయులను రూ.10, 116 వేల నగదు బహుమతి అందజేశారు. వివిధ పోటీల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు అవార్డులు సాధించడం అభినందనీయమని హరీశ్‌రావు ప్రశంసించారు. వీరిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని మిగిలిన విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా ప్రతిభ కనపర్చాలని ఆకాంక్షించారు.