మహిళలు రాకెట్లు, విమానాలు నడుపుతూ తమ సత్తా చాటుతున్నారని.. కార్లను సైతం విజయవంతంగా నడుపుతారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. యువతకు స్వయం ఉపాధి కల్పన చర్యల్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. డ్రైవింగ్‌పై ఆసక్తి ఉన్న మహిళలను ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇచ్చి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై కార్లు అందిస్తున్నారు. ఇందులో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న 18మందికి కార్లను అందజేశారు. ఇక్కడి ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరిస్తామని తెలిపారు.
మూడు నెలల పాటు వీరి పనితీరును అంచనా వేసి.. ప్రతినెల తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎస్సీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రూ.2,737కోట్లతో లక్షా 63వేల మందికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఈ కార్యక్రమం అనంతరం షీ క్యాబ్‌లోనే సంగారెడ్డి చౌరస్తా వరకు మంత్రి ప్రయాణించారు.
ప్రభుత్వంతో పాటు మరికొన్ని సంస్థలు సైతం మహిళా డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందించాయి. ఉబర్ సంస్థ సాధరణంగా తమతో ఒప్పందం చేసుకున్న మొదటి నెల రూ.2వేలు అందిస్తుంది... కానీ వీరికి రూ.పది వేలు ఇస్తున్నారు. వీరికి ట్రిప్ రద్దు రుసుం తొలగించారు. ఎలాంటి ఫిర్యాదులు లేని ప్రయాణికుల ట్రిప్‌లు మాత్రమే కేటాయించనున్నారు. వీరి వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ప్రతి మహిళా డ్రైవర్‌కు ఉచితంగా రక్షణ కిట్ అందించారు. టోరెంట్ గ్యాస్ రూ.2500 ఉచిత గ్యాస్ కూపన్లు ఇచ్చింది.