Sangareddy Small Traders Market Problems :ఎండకి ఎండుతూ.. వానకు తడుస్తూ కూరగాయలు పాడైపోయి నష్టపోతున్న చిరువ్యాపారుల కోసం సంగారెడ్డి మున్సిపాలిటీ మార్కెట్ యార్డ్‌లో దుకాణాలు నిర్మించింది. మంత్రి హరీశ్ రావు వీటిని ప్రారంభించారు. ప్రారంభం జరిగింది కానీ నేటికీ అవి లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. వాటిని ప్రారంభించి దాదాపు ఏడాదన్నర కావొస్తున్న దుకాణాలకు విముక్తి కలగలేదు.
దుకాణాలు కేటాయిస్తే తమ వ్యాపారం బాగుంటుందని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్న దుకాణాలను ఆసరాగా చేసుకున్న మందుబాబులు.. ఆ ప్రాంతాన్ని తమ అడ్డగా వినియోగించుకుంటున్నారు. పేకాట రాయుళ్లు చక్కటి గూడుగా భావిస్తున్నారు.
సంగారెడ్డిలో సేంద్రీయ కూరగాయల మార్కెట్ ప్రారంభం
Small Traders Sell Vegetables by Roadside :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గంజిమైదాన్ మార్కెట్ చిరువ్యాపారుల కోసం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2005లో దుకాణాల ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అప్పటి నుంచి నత్తనడకన సాగుతూ రూ.138 లక్షల అంచనా విలువతో 67 దుకాణాలు నిర్మించారు. 2022 జులై 19న మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) ఈ షాపులను ప్రారంభించారు. కానీ అవి లబ్ధిదారులకు మాత్రం నేటీకీ అందని ద్రాక్షగానే మిగిలింది. ఏమిచేయాలో పాలుపోని చిరువ్యాపారులు కూరగాయలను రోడ్ల వెంట విక్రయిస్తున్నారు. దీని ద్వారా వర్షకాలంలో కూరగాయలు తడిచి కుళ్లిపోయి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐడీయస్ఎమ్టీ ఖర్చుల కింద పూర్తిగా 67 షాపులను రూ.1.14 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఐడీయస్ఎమ్టీ నిబంధనల ప్రకారం దుకాణాలు బహిరంగ వేలం ద్వారా లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 67 దుకాణాలు కూడా వివిధ పరిమాణాల్లో నిర్మించారు. స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు ప్రభుత్వానికి లేఖ రాసి పంపించాం. లేఖ ఆధారంగా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు దుకాణాలు పంపిణీ చేస్తాం. :-సుజాత, మున్సిపల్ కమిషనర్, సంగారెడ్డి