Rajiv Park Problems In Sangareddy : సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో భాగంగా ప్రజల సౌకర్యాల కోసం 2013లో రూ.3కోట్ల రూపాయలతో మున్సిపల్ ఆధ్వర్యంలో రాజీవ్ పార్కును ఏర్పాటు చేశారు. సర్వాంగ సుందరంగా మంచి హంగులతో పార్కు అందుబాటులోకి తీసుకొచ్చారు. సెలవు దినాల్లో కుటుంబ సమేతంగా వచ్చి రోజు మొత్తం అక్కడే గడిపి సేద తీరేవారు. చిన్నారులు ఆడుకోవడాని ప్రత్యేకించి వ్యాయామ పరికరాలను కూడా పార్కులో ఏర్పాటు చేశారు.
పార్కులోనికి ప్రవేశానికి రూ.10 సంవత్సరాల చిన్నారులకు రూ.5 రూపాయలు, ఆ పై వయసు కలిగిన వారికి రూ.10 రూపాయల చొప్పున టికెట్ నిర్ణయించారు. ప్రతి రోజు వాకింగ్ కోసం వచ్చే వారికి నెల రోజులకుగాను రూ. 250 రూపాయలుగా ధర నిర్ణయించారు. కరోనా సమయంలో రెండేళ్ల పాటు పార్కును పూర్తిగా మూసివేశారు. తిరిగి గత 6నెలల క్రితం పునఃప్రారంభించారు. దాని మరమ్మతుల కోసం ప్రత్యేక నిధుల కింద 50 లక్షల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆధునికీకరణ కోసం ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు.
Siddipet Dinosaur Park Opening : ఔరా అనిపిస్తున్న 'సిద్దిపేట డైనోసార్ థీమ్ పార్క్' చూశారా..?
ఇంతక ముందు 2019లో రూ.95 లక్షల రూపాయలతో మరమ్మతులు చేసినా ప్రయోజనం శూన్యం. నిధులు కేటాయిస్తున్న అభివృద్ధి మాత్రం నామ మాత్రంగానే నిలుస్తోంది. ప్రస్తుతం చిన్నారులు ఆడుకోవడానికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. దట్టమైన అడవిలా ముళ్లపొదలు పేరుకుపోయాయి. ఎటు చూసినా అపరిశుభ్రత, పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.
సరైన పర్యవేక్షణ లేక మందుబాబులకు పార్కు అడ్డాగా నిలిస్తోంది. కాలక్షేపం చేయాలనుకునేవాళ్లంతా ఇక్కడే సంచరిస్తున్నారు. జిల్లా నడిబొడ్డున ఉన్న పార్కు ఇంత దారుణంగా మారుతున్నా.. అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. తమకు ఎంతగానో ఉపయోగపడిన పార్కు ఇప్పుడు కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే పాడైపోతోందని ఆరోపిస్తున్నారు. తమ పార్కును తిరిగి వాడకంలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.