కొవిడ్-19తో ప్రపంచం తలకిందులవుతున్న వేళ.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు విశ్వవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. అటు కరోనాను నిర్ధరించేందుకు పలు పరీక్షలు చేస్తున్నా... ఫలితాలు వచ్చేందుకు చాలా సమయం పడుతోంది. దీనికి తోడు వైద్య పరికరాల కొరత కారణంగా టెస్టులు పూర్తి స్థాయిలో చేయడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పలువురు శాస్త్రవేత్తలు... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లాకు చెందిన ఔత్సాహిక పరిశోధకుల బృందం.. వైరస్‌ను క్షణకాలంలోనే నిర్ధరించేందుకు.. ఓ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను రూపొందించి ఆశ్చర్యపరిచింది.
5 నుంచి 10 సెకన్ల వ్యవధిలో..
అమీన్‌పూర్ మండలం బీరంగూడలో ఉంటున్న... వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు రాధాకృష్ణ... మరికొద్దిమంది అధ్యాపకులు, శిష్య బృందంతో కలిసి ఒక కంప్యూటర్ అప్లికేషన్ రూపొందించారు. కృత్రిమ మేధను ఉపయోగించి కరోనా సోకిన వారిని గుర్తించేలా పరిశోధకులు సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ఛాతికి సంబంధించిన ఎక్స్‌రే, సిటీ స్కాన్ ఇమేజీలను విశ్లేషించి ఫలితాలను అందించడం దీని ప్రత్యేకత. నిపుణులైన రేడియాలజిస్టులు, వైద్యులకు కష్టతరమైన ఈ పనిని... ఈ సాంకేతిక ద్వారా పూర్తి చేయవచ్చిన ధీమాగా చెబుతున్నారు. ఎక్స్‌రేను స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ ద్వారా స్కాన్ చేసి కొవిడ్ ఉందో లేదో... 5సెకన్ల వ్యవధిలోనే తెలుసుకునేలా దీన్ని రూపకల్పన చేశారు. 99.4శాతం కచ్చితత్వంతో వైరస్ ధ్రువీకరణ అవుతోందని బృంద సభ్యులు చెబుతున్నారు.
"కొన్ని పరిశోధనల ఆధారంగా ఈ అప్లికేషన్ రూపొందించాం. మేము కొన్ని ఛాతి ఎక్స్‌రేలు తీసుకొని మా అల్గారిథంలో అమలు చేశాం. ఈ ప్రయత్నంలో వేరేవాటితో పోల్చుకుంటే మా ఫలితాలు మెరుగ్గా కనిపించాయి."
-అరవింద్, వీఎన్‌ఆర్ పూర్వ విద్యార్థి
పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు..
తాము తయారు చేసిన ఈ అప్లికేషన్ ద్వారా... కొవిడ్-19, న్యూమోనియా, టీబీ వంటి వ్యాధుల లక్షణాలకు మధ్య తేడా కచ్చితంగా చూపిస్తుందని అంటున్నారు రాధాకృష్ణ బృందం సభ్యులు. అప్లికేషన్‌లో అప్లోడ్ చేసే సమయంలో వివిధ విభాగాల్లో పిక్సల్ సమాచారం నష్టపోకుండా కచ్చితమైన ఫలితాన్ని ఇస్తుందని పేర్కొంటున్నారు. అప్లికేషన్‌లో ఒకేసారి వేయి ఎక్స్‌రేలు అప్లోడ్ చేసే సామర్థ్యం ఉండడంతో పాటు వాటి ఫలితాలను కేవలం ఐదు నుంచి పది సెకన్ల వ్యవధిలోనే నిర్ధరించడం ఈ సాంకేతికత ప్రత్యేకత. ఇప్పటివరకు దాదాపు 30 వేల ఎక్స్‌రేలు విశ్లేషించి ఫలితాలు నిర్ధరించినట్లు రాధాకృష్ణ తెలిపారు. దీనిపై పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు వెల్లడించారు.