తెలంగాణ

telangana

ETV Bharat / state

Zycov-D vaccine: పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్.. 15 నుంచి 'జైకోవ్‌-డి' టీకా! - 15 నుంచి 'జైకోవ్‌-డి' టీకా

జైడిష్‌ క్యాడిలా సంస్థ ‘జైకోవ్‌-డి’ పేరిట ఉత్పత్తి చేసిన టీకా ఈ నెల 15వ తేదీ నుంచి బహిరంగ విపణిలో అందుబాటులో ఉంటుంది. ఈ టీకా వేయడానికి సూది వినియోగించరు. ‘ఫార్మాజెట్‌’ అనే పరికరం సాయంతో వ్యాక్సిన్‌ వేస్తారు. 12 ఏళ్ల పైబడిన వారూ ఈ టీకాను పొందొచ్చు.

Zycov-D vaccine
15 నుంచి 'జైకోవ్‌-డి' టీకా

By

Published : Sep 4, 2021, 9:29 AM IST

ప్రస్తుతం 18 ఏళ్ల పైబడిన వారికే కొవిడ్‌ టీకా అందజేస్తున్నారు. తాజాగా 12 సంవత్సరాలు దాటిన వారూ పొందే టీకా వచ్చేసింది. జైడిష్‌ క్యాడిలా సంస్థ ‘జైకోవ్‌-డి’ పేరిట ఉత్పత్తి చేసిన టీకా ఈ నెల 15వ తేదీ నుంచి బహిరంగ విపణిలో అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని వైద్య వర్గాలు వెల్లడించాయి. అయితే.. ప్రభుత్వ వైద్యంలో ఈ టీకా ఎప్పటి నుంచి లభ్యమవుతుంది అన్న అంశంపై స్పష్టత రాలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ధరను కూడా నిర్ణయించిన తర్వాతే సర్కారు వైద్యంలో ప్రవేశపెడతారని, అందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమైన దృష్ట్యా ఈ టీకా రావడం విద్యార్థులకు ప్రయోజనకరమన్న భావన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 12 నుంచి 18 ఏళ్ల మధ్యవయస్కులు సుమారు 48 లక్షల మంది ఉంటారని అంచనా. అవసరమైన వారు బహిరంగ విపణిలో సొంతంగా కొనుగోలుచేసి ఈ టీకాను పొందాల్సి ఉంటుంది. రెండేళ్ల పైబడిన వారి కోసం భారత్‌ బయోటెక్‌ సంస్థ ఉత్పత్తి చేయనున్న టీకా వచ్చే నవంబరులో అందుబాటులోకి రావచ్చని వైద్య వర్గాలు తెలిపాయి.

మూడు డోసుల్లో..

  • ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను రెండు డోసుల్లో పొందుతుండగా.. ‘జైకోవ్‌-డి’ను మూడు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది.
  • మొదటి డోస్‌ తీసుకున్న 28 రోజులకు రెండో డోసు, రెండో డోసు పొందిన తరవాత 28 రోజులకు మూడో డోసు పొందాలి. ఈ లెక్కన తొలి డోసు నుంచి మూడో డోసు టీకా పొందడానికి మధ్య వ్యత్యాసం 56 రోజులు.
  • ఈ టీకా వేయడానికి సూది వినియోగించరు. ‘ఫార్మాజెట్‌’ అనే పరికరం సాయంతో వ్యాక్సిన్‌ వేస్తారు. ఆ పరికరాన్ని చర్మంపై ఉంచి నొక్కడం ద్వారా టీకా శరీరంలోనికి ప్రవేశిస్తుంది.
  • ‘జైకోవ్‌-డి’ను 2-8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు.

ఇదీ చదవండి :Tollywood Drugs Case: డ్రగ్స్​ కేసుపై పూనమ్​ సంచలన ట్వీట్!

ABOUT THE AUTHOR

...view details