హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రముఖ న్యాయవాది, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు ఫణీంద్ర భార్గవ్... మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామపత్రాలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా కోర్టు సముదాయం నుంచి భారీ వాహన శ్రేణితో ర్యాలీగా బయల్దేరి జీహెచ్ఎంసీ లైబ్రరీకి వెళ్లారు.
విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి కల్పన ప్రధాన ఎజెండాగా తాను బరిలో నిలుస్తున్నట్లు భార్గవ్ తెలిపారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, న్యాయవాదుల సమస్యలపై చిత్తశుద్ధితో చట్టసభలో పోరాటం చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆయన అన్నారు. చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యం పెరిగేలా కృషి చేస్తానని తెలిపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బార్ కౌన్సిల్ సభ్యులు ఫణీంద్ర భార్గవ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఒక్క వర్గాన్నీ సంతృప్తి పరచలేక పోయాయని, అరాచక పాలనపై ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా నిలుస్తానని ఫణీంద్ర భార్గవ్ పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న ప్రభుత్వం హామీ నెరవేర్చటంలో విఫలమైందన్నారు. ఎవరూ కోరని ఉచిత హామీలు ఇచ్చి, ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. గ్రాడ్యుయేట్లంతా చదువుకున్నవారని, ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకుని సత్తా చాటాలని కోరారు. సామాజిక న్యాయం కోసం పాటుపడే తనకు సామాజిక మాధ్యమాల్లో యువత మద్దతుగా ప్రచారం చేసి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన తనకు ఓటర్లందరూ అండగా ఉండాలని విన్నవించారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రంలో.. కిందిస్థాయి సామాన్యులకు ఫలాలు అందడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందేనని, అనేక అభివృద్ధి పనులు నిధులు కేటాయించకుండా తాత్సారం చేస్తూ... మాటలతో దాటేస్తున్నారని ఆక్షేపించారు.
ఎమ్మెల్సీకి బార్ కౌన్సిల్ సభ్యులు ఫణీంద్ర భార్గవ్ నామినేషన్ ఇదీ చూడండి:విపత్తుల నుంచి కాపాడతామన్నారు.. ఇప్పుడు ముంచేస్తున్నారు!