ఆలోచనలకు కృషిని మేళవిస్తూ... సరికొత్త కళాకృతులతో అబ్బురపరుస్తున్నారు. వృత్తినే జీవనోపాధిగా ఎంచుకుని.... అందులోనే వారు అద్భుతాలు సృష్టిస్తున్నారు. అగ్గిపెట్టలో (match box) ఇమిడే చీర... అదే పరిమాణంలో శాలువాలు తయారు చేసి గతంలో అందరినీ ఆశ్చర్యపర్చిన ఆ నేతన్న.... తాజాగా మరో కళాత్మకతను ప్రదర్శించి... 'కళలకు కాదేదీ అనర్హం' అని నిరూపించారు.
సిరిసిల్లలోని నెహ్రూనగర్‌కు చెందిన నేతకార్మికుడు వెల్ది హరిప్రసాద్ (veldi hariprasad).... చిన్నతనం నుంచే మరమగ్గాలపై (handlooms) ఆసక్తిని పెంచుకున్నారు. తండ్రి మగ్గం నేస్తే.... తల్లి మగ్గానికి కావాల్సిన కండెలు చుట్టేది. వీటిని నిత్యం గమనిస్తుండే హరిప్రసాద్.... తనదైన ఆలోచనలకు పదునుపెట్టారు. మొదటగా వెదురు కర్రతో కేవలం 10 సెంటీ మీటర్ల పొడవు, 200 గ్రాముల బరువుండే మగ్గాన్ని తయారు చేశారు. తర్వాత అగ్గి పెట్టలో ఇమిడే చీర, అదే సైజులో శాలువా, ఉంగరంలో, సూదిలో దూరే చీరలను తయారీ చేసి... ఆశ్చర్యానికి గురిచేశారు హరిప్రసాద్. ఆయన కళాత్మకతను గుర్తించిన ప్రభుత్వం... జాతీయ చేనేత దినోత్సవాన్ని (National Handloom Day) పురస్కరించుకుని కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర స్థాయి అవార్డుతో సత్కరించింది.
అగ్గిపెట్టెలో ఇమిడే షర్ట్, లుంగీను జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేను వారం రోజుల్లో నేశాను. లుంగీ బరువు 140 గ్రాములు ఉండగా షర్ట్ 100 గ్రాముల బరువు ఉంది. ఇవి రెండూ అగ్గిపెట్టెలో ఇమిడిపోయే విధంగా తయారు చేశాను. గతంలో కూడా అగ్గిపెట్టెలో ఇమిడే చీర, శాలువాలను నేశాను.
- వెల్ది హరిప్రసాద్, చేనేత కళాకారుడు
ఈ యేడు చేనేత దినోత్సవం సందర్భంగా అగ్గి పెట్టెలో ఇమిడే లుంగీ, షర్ట్‌ను (shirt and lungi) తయారు చేశారు. మల్బర్ సిల్క్‌ను ఉపయోగించి మగ్గంపై నేసిన ఈ వస్త్రాలు వ్యక్తులు ధరించే వీలుగా ఉంటాయని హరిప్రసాద్ తెలిపారు. వీటి తయారీకి వారం రోజులు పట్టిందని పేర్కొన్నారు. వీటిలో షర్ట్ 100 గ్రాములు, లుంగీ 140 గ్రాముల బరువు ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.