కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలే కేంద్రంలో అధికారాన్ని దక్కించుకున్న మోదీ సర్కారు వరాల జల్లుల్ని కురిపిస్తుందనే ఆశ అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా రంగాలకు కేటాయింపులు.. కొత్తగా నాలుగు జిల్లాలకు దక్కాల్సిన ప్రయోజనాలు.. రైలు మార్గాలకు నిధుల కేటాయింపులు.. అన్నింటికీ మించి వేతన జీవులను ఊరిస్తున్న ఆదాయ పన్ను పరిమితి పెంపుపై ఉత్కంఠ నెలకొంది.
పలు జిల్లాలకు అనుసంధానమైన జగిత్యాల-కరీంనగర్- వరంగల్ జాతీయ రహదారి అభివృద్ధికి అవసరమైన నిధులు, ఇదే తరహాలో కరీంనగర్- సిరిసిల్ల- పిట్లం, సిరిసిల్ల- సిద్దిపేట- జనగాం, జగిత్యాల- మెట్‌పల్లి- నిజామాబాద్, నిర్మల్-ఖానాపూర్- జగిత్యాల, రాయపట్నం-కరీంనగర్-కోదాడ మార్గాలకు కేటయింపులు కోరుతున్నారు. పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేసే కల సాకరమయ్యేలా ఈ బడ్జెట్‌లో ప్రస్తావన ఉంటే జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల రైతాంగానికి ఊహించని మేలు జరగనుంది. కొత్తగా కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలనుకునే ట్రిఫుల్ ఐటీకి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే ఇక్కడి విద్యార్థి లోకానికి మేలు జరిగేవీలుంది. ఇదే తరహాలో కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాల ఏర్పాటు సాకారం కావాలి.
స్మార్ట్ సిటీకి ఊతమిచ్చేలా మరిన్ని నిధులు అందాలి. ఆకర్షణీయ పట్టణాల జాబితాలో ఉన్న కరీంనగర్‌కు సమున్నత స్థానం అందేలా గతంలో పెట్టిన ప్రతిపాదనలకు సర్కారు సై అంటే పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఆశించిన అభివృద్ధి కళ్లకు కనిపించే వీలుంది. సిరిసిల్ల జిల్లా వస్త్రోత్పత్తి పరిశ్రమల విషయంలో సిరిసిల్ల జిల్లాది అగ్రస్థానం. మరమగ్గాల వస్త్రోత్పత్తి రంగంపై ఆధారపడి జీవించే కార్మికుల వేల సంఖ్యలో ఉన్నారు. వీరి జీవనోపాధికి వీలుగా గతంలో ఇచ్చిన హామీలు నెరవేరేలా ప్రగతి ఫలాలు అందాలి.
ఉమ్మడి జిల్లాలో ఉపాధిహామీ కూలీ పనులు చేసే వారికి మరింత మేలు కలిగేలా కొత్తగా నిధులు సహా వ్యవసాయానికి అనుబంధంగా అవసరమైన నిర్ణయాలు విత్తమంత్రి మాటల్లో వినిపించాలి. కొత్త మార్గదర్శకాలు ఉపాధి హామీ పథకంలో అగుపించాలి. ఉద్యోగ కల్పన సహా అన్నదాతలకు ఊతమిచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలకు మరిన్ని నిధులు అందితే జిల్లాలో యువతకు, రైతులకు ఊహించని మేలు జరిగే వీలుంది. కీలకమైన జలశక్తి పథకానికి భారీగా నిధులు అందితే జిల్లాకు వరంగా మారే వీలుంది.