శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. రెండు రోజుల్లోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరింది. ఈనెల 20న 12వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటే.. ప్రాజెక్టులో 71టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. రెండు రోజుల్లోనే పూర్తిగా నిండిపోయింది. 21న రాత్రికి 29వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటే.. 74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 21న అర్ధరాత్రి నుంచి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒకేసారి 59వేల క్యూసెక్కుల ప్రవాహం రాగా.. గురువారం ఉదయం ఆరు గంటలకల్లా 70వేలు దాటింది. నీటి నిల్వ 78 టీఎంసీలకు చేరుకుంది. ఉదయం పది గంటలకు లక్షన్నర క్యూసెక్కుల ప్రవాహం రాగా.. నీటి నిల్వ 80 టీఎంసీలకు చేరింది. ఉదయం 11గంటలకు 2.8లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం ప్రాజెక్టులో చేరింది. మధ్యాహ్నం 12గంటలకు ఏకంగా 4.32క్యూసెక్కుల ప్రవాహం ప్రాజెక్టులోకి పోటెత్తింది.
వరుసగా గేట్లు ఎత్తివేత..
భారీ ప్రవాహం ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఎనిమిది గేట్లు ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. విద్యుదుత్పత్తి చేస్తూ... 8 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. మధ్యాహ్నం 2గంటలకు ప్రవాహం 4లక్షల క్యూసెక్కులకు చేరుకోగా.. 16గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. మధ్యాహ్నం 3గంటలకు 32గేట్లు ఎత్తగా.. 2లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రాజెక్టు నుంచి రెండున్నర క్యూసెక్కులు వదిలారు. ఐదు గంటలకు మూడు లక్షల ఇన్ ఫ్లో ఉంటే.. నాలుగు లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. సాయంత్రం ఏడు గంటలకు 35 గేట్లు ఎత్తి నది పూర్తి సామర్థ్యం 6 లక్షల క్యూసెక్కులను గోదావరిలోకి వదిలారు. రాత్రి ఎనిమిది గంటలకు అవుట్ ఫ్లో నాలుగున్నర లక్షలకు తగ్గించారు.