తెలంగాణ

telangana

By

Published : Feb 3, 2023, 6:08 PM IST

ETV Bharat / state

ఉత్తర తెలంగాణాకు ఆర్థికంగా సాకారం అందిస్తోన్న కాకతీయ సాండ్ బాక్స్

Kakatiya sand box program in Nizamabad: మనిషిలో ప్రతిభ ఎంత ఉన్నా ప్రోత్సాహం లేక ఒక్కోసారి ఎదుగుదలకు అవకాశం ఉండదు. వినూత్నమైన ఆలోచనలు బోలెడు ఉన్నా వాటిని ఆవిష్కరించేందుకు తావు దక్కదు. అలాంటి వారికి వెన్ను తట్టేందుకు సరైన వేదిక దొరికితే అద్భుతంగా సత్తా చాటుతారు. అలా వెన్నుతట్టే పనినే చేస్తోంది కాకతీయ సాండ్‌బాక్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ. పదేళ్ల కింద ఉత్తర తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ ఆర్థిక అభివృద్ధి కోసం ప్రారంభమైన ఈ సంస్థ అనేక మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది. వివిధ అంశాల్లో శిక్షణనిస్తూ వారు జీవితంలో స్థిరపడేలా ప్రోత్సాహం అందిస్తుంది. కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా మహిళలకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి వారి స్వయం ఉపాధికి తోడ్పాటును అందించడం సహా రైతులకు సాగు పద్ధతుల్లో మెళకువలను కాకతీయ సాండ్‌ బాక్స్‌ నేర్పిస్తోంది. అన్నదాతలకు ఆధునిక సాగు పద్ధతులు నేర్పిస్తూ ఖర్చులు తగ్గి దిగుబడి పెంచేలా ఈ సంస్థ తన వంతు కృషి చేస్తోంది .

Kakatiya sand box which is developing North Telangana
ఉత్తర తెలంగాణాను ఆర్థికంగా అభివృద్ద చేస్తున్న కాకతీయ సాండ్ బాక్స్

ఉత్తర తెలంగాణాను ఆర్థికంగా అభివృద్ది చేస్తున్న కాకతీయ సాండ్ బాక్స్

Kakatiya sand box program in Nizamabad: తెలంగాణ ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతోంది. అనేక అంకుర పరిశ్రమలు, ఐటీ, సాంకేతిక సంస్థలు ఈ గడ్డమీద ప్రాణం పోసుకుంటున్నాయి. అయితే ఈ సంస్థలన్నీ హైదరాబాద్‌కే పరిమితం అవుతూ వస్తుండగా, ఉత్తర తెలంగాణాలో కూడా వాటికి సంబంధించిన ప్రతిభా సామర్థ్యాలను ప్రోత్సహించడం సహా రైతులకు ఆధునిక పద్ధతుల్లో శిక్షణ, మహిళల సాధికారత కల్పన అనే ఉద్దేశంతో ఏర్పాటైన స్వచ్ఛంద సంస్థ కాకతీయ సాండ్‌ బాక్స్‌. కళాశాల విద్యార్థులకు సాంకేతిక కోర్సులు, నైపుణ్య శిక్షణ, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ సహా అనేక కోర్సుల్లో ఈ సంస్థ శిక్షణనిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు కూడా స్కిల్‌ ఇన్‌ విలేజ్‌ కింద ఆంగ్లబోధనతో పాటు జీవితంలో ఎదిగేందుకు అవసరమైన శిక్షణను అందిస్తోంది. మహిళలు స్వయం ఉపాధి సాధించేలా తర్ఫీదు ఇవ్వడం సహా అన్నదాతలకు ఆధునిక సాగు పద్ధతులు నేర్పిస్తూ ఖర్చులు తగ్గి దిగుబడి పెంచేలా తన వంతు కృషి చేస్తోంది కాకతీయ సాండ్‌బాక్స్‌.

గ్రామీణ ఆర్థికాభివృద్దికి కృషి చేస్తోంది: ఉత్తర తెలంగాణను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 2013లో రాజురెడ్డి, సామా ఫణీంద్ర అనే ఇద్దరు కలిసి కాకతీయ సాండ్‌బాక్స్‌ను నిజామాబాద్ లో స్థాపించారు. కర్ణాటక హుబ్లీలోని దేశ్‌పాండే ఫౌండేషన్ స్ఫూర్తితో దీనిని స్థాపించారు. కాకతీయ సాండ్ బాక్స్‌లో మొత్తం 270 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. నాలుగు అంశాల్లో ఈ సంస్థ పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వ్యవసాయం, స్కిల్లింగ్, మైక్రో ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌లో శిక్షణ సహా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నారు. ప్రతి అంశంలోనూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామీణ ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.

విద్యార్థులకు ఆంగ్లంపై పట్టు వచ్చేలా కృషి:కాకతీయ సాండ్‌బాక్స్‌ గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం స్కిల్ ఇన్ విలేజ్ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. పాఠశాల దశలోనే ఇంగ్లీషు మీద మంచి పట్టు సాధించేందుకు దీన్ని చేపట్టారు. అయిదు నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంగ్లంతో పాటు కమ్యునికేషన్ స్కిల్స్‌, లైఫ్‌ స్కిల్స్‌ను పెంపొందించడం దీని ఉద్దేశం. ప్రస్తుతం 20 పాఠశాలల్లో దీన్ని నిర్వహిస్తున్నారు. దీని కోసం సిద్ధిపేట, నిజామాబాద్‌ జిల్లాలోని పది చొప్పున గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకున్నారు. వచ్చే ఏడాది నుంచి 40 ప్రభుత్వ పాఠశాలలకు దీన్ని విస్తరించనున్నారు. కాకతీయ సాండ్‌బాక్స్‌ సంస్థ ద్వారా శిక్షణ పొందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉన్నత విద్యలో సత్తా చాటుతున్నారు. గతేడాది ఎనిమిది మంది విద్యార్థులు బాసర త్రిపుల్ ఐటీలోనూ చోటు సంపాందించారు.

డిగ్రీ విద్యార్థులకు స్కిల్స్ పెంచుకొనేలా కోర్సులు: డిగ్రీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోసం కాకతీయ సాండ్‌బాక్స్‌ స్కిల్ ప్లస్, స్కిల్ ప్లస్-ఆర్ అనే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బీఏ, బీకాం, బీజెడ్సీ వంటి డిగ్రీ పాసైన వారి కోసం సుసంది, కౌటిల్య అనే రెండు కోర్సులు ఉన్నాయి. సుసంది కింద బీఏ, బీఎస్సీ, కౌటిల్య కింద బీకాం విద్యార్థులకు కోర్సులు అందిస్తున్నారు. వీటికి నాలుగు నెలల కాల పరిమితి ఉంటుంది. దీనిలో ఇంగ్లిష్ కమ్యునికేషన్ స్కిల్, రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్, ఐసీటీ-ఇన్ఫర్మేషన్ కమ్యునికేషన్ టెక్నాలజీ, కంప్యూటర్, టైపింగ్, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, లీడర్ షిప్ డెవలప్ మెంట్ ను ప్రాక్టికల్, థియరికల్ గా నేర్పిస్తారు. శిక్షణ తర్వాత ఉద్యోగాలు పొందేందుకు సైతం సహకారం అందిస్తోంది కాకతీయ సాండ్‌బాక్స్‌.

కళాశాల్లోనే అన్ని అంశాలు నేర్పిస్తారు: విద్యార్థులు డిగ్రీ పాసైన తర్వాత తమ శిక్షణా కేంద్రానికి వచ్చి నేర్చుకునే బదులు కాకతీయ సాండ్‌బాక్స్‌ ఉద్యోగులే కళాశాలలకు వెళ్లి నేర్పిస్తారు. దీన్ని స్కిల్ ప్లస్​గా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం కళాశాలలతో ఎంఓయూ చేసుకుంటున్నారు. రెసిడెన్షియల్​లో నేర్పిన అన్ని అంశాలను కళాశాలల్లోనూ నేర్పిస్తారు. ఈ సంస్థ ద్వారా శిక్షణ తీసుకున్న78మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఒక విద్యార్థిని దిగ్గజ సంస్థ గూగుల్‌లో మంచి ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. కాకతీయ సాండ్‌బాక్స్‌ నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట క్లస్టర్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒక్కో క్లస్టర్ లో మూడు నుంచి నాలుగు కళాశాలలు ఉంటాయి.

రైతులకు కూడా సాయం అందిస్తోంది: కాకతీయ సాండ్‌బాక్స్‌ వ్యవసాయాభివృద్ధికి కూడా తోడ్పాటును అందిస్తోంది. సాగులో సంప్రదాయ పద్ధతులతో పాటు నూతన పోకడలను పరిచయం చేస్తూ రైతుల దిగుబడి పెరిగేందుకు సాయం అందిస్తోంది. పత్తిరైతుల కోసం బెటర్ కాటన్ ఇనిషియేటివ్‍ బీసీఐ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం కింద పత్తి రైతులకు పొలాల్లోనే ప్రామాణిక పద్ధతుల ద్వారా శిక్షణ ఇస్తారు. ఇది సిద్దిపేట కేంద్రంగా పని చేస్తోంది. విత్తడం దగ్గర నుంచి పంట కోసే వరకు అన్ని దశల్లోనూ సలహాలు అందిస్తూ రైతులకు వెన్నంటి నిలుస్తోంది. రైతుల సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఫార్మ్‌ పాండ్స్‌ అనే మరో కార్యక్రమాన్ని కాకతీయ సాండ్‌బాక్స్‌ నిర్వహిస్తోంది.

రైతుల కోసం ఖర్చులు తగ్గించేందుకుప్రత్యేక కార్యక్రమం: రైతుకున్న వ్యవసాయ భూవిస్తీర్ణానికి అనుగుణంగా ఫార్మ్ పాండ్స్ నిర్మించేందుకు సాయం చేస్తుంది. దీనివల్ల రైతుకు రెండు సీజన్లకు సాగునీరు అందుబాటులో ఉంటుంది. వీటిని నిర్మించేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడంలోనూ ఈ సంస్థ సాయం చేస్తోంది.వ్యవసాయంలో కాకతీయ సాండ్‌బాక్స్‌ నిర్వహిస్తున్న మరో కార్యక్రమం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనేషన్ ఎఫ్​పీఓ రైతులు ఎరువులు, విత్తనాలు కొనే సమయంలో దళారులకు కమీషన్లు చెల్లించే అవసరం లేకుండా చేసేందుకు దీనిని ప్రారంభించారు. ఈ సంస్థ రైతుల కోసం నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లిలో పైలట్‌ ప్రాజక్టు కింద సస్టెయినబుల్ రైస్ ఇనిషియేటివ్ అనే ఇంకో కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. సంప్రదాయ సాగులోనే ఖర్చులు తగ్గించి దిగుబడి పెంచేందుకు దీని ద్వారా కృషి చేస్తున్నారు. నర్సరీని పెంచడం, వరి నాటు యంత్రాల వినియోగం, డ్రైయింగ్ అండ్ వెట్టింగ్ పద్ధతిలో పంటకు నీరు అందించేలా కాకతీయ సాండ్‌ బాక్స్‌ సాయం చేస్తోంది.

మహిళల ఉపాధికి కృషి:ఈ పద్ధతుల్లో ఇప్పటి వరకు 25శాతం పెట్టుబడి ఖర్చులు తగ్గగా, 30శాతం నీరు ఆదా అయ్యింది. ఎకరానికి 15శాతం ఉత్పత్తి, 20 నుంచి 25శాతం ఆదాయమూ పెరిగింది. మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు కూడా కాకతీయ సాండ్‌ బాక్స్ కృషి చేస్తోంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసే మహిళలకు శిక్షణ ఇస్తోంది. మైక్రో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కార్యక్రమం కింద ఆధునిక యంత్రాల వాడకం సహా కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ వంటి వాటిలో కొత్త పద్దతులు నేర్పిస్తారు. మహిళలకు కాకతీయ సాండ్ బాక్స్ 20వేల రూపాయల నుంచి లక్షన్నర వరకు రుణాలు కూడా ఇస్తుంది. ఈ సంస్థ సాయంతో అనేక మంది మహిళలు ఉపాధి పొందడంతో పాటు ఇతరులకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు.

స్టార్టప్​లకు ఆసరాగా నిలుస్తోంది: అంకుర పరిశ్రమల ఏర్పాటుకు కూడా కాకతీయ సాండ్‌బాక్స్‌ తోడ్పాటు అందించనుంది. ఎంటర్ ప్రెన్యూర్ కావాలని భావిస్తున్న వారికి అవసరమైన సాయం అందించనుంది. కన్వల్ రేఖి రూరల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ స్టార్టప్ సెంటర్ క్రెస్ట్‌ పేరుతో ఈ సేవలు అందించనుంది. అమెరికాలో కంపెనీ ప్రారంభించి పబ్లిక్ ఇష్యూకి వెళ్లిన మొదటి భారతీయుడుగా నిలిచిన వ్యక్తి కన్వల్ రేఖి. ఈయన కాకతీయ సాండ్ బాక్స్​కు రూ.20 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ నిధులతోనే స్టార్టప్‌ శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీని కోసం నిజామాబాద్ నగర శివారులోని బర్దిపూర్‌లో శిక్షణ కేంద్రాన్ని నిర్మించనుంది.

కాకతీయ సాండ్‌బాక్స్‌ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. అనేక మంది విద్యార్థులు, రైతులు, మహిళలకు మేలు చేస్తున్న తమ కార్యక్రమాలను ఉత్తర తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించే యోచనలో ఉంది కాకతీయ సాండ్‌ బాక్స్‌.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details