నిర్మల్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పోచంపాడ్ అనే గ్రామం ముంపునకు గురైంది. ముంపు బాధితులకు నిర్మల్ మండలంలో ప్రభుత్వం కొంత భూమి కేటాయించింది. నలభై ఏళ్లుగా పోచంపాడ్ గ్రామ ప్రజలు అక్కడే నివసిస్తూ... వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే.. ప్రభుత్వం గ్రామ అవసరాలకు కేటాయించిన భూమిని కొంత మంది ఆక్రమణ దారులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం ఈ విషయమై పలుమార్లు కలిసినా.. స్పందించడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని అనుకొని ఉన్న సుమారు 9 ఎకరాల స్థలాన్ని గ్రామానికి సంబంధం లేని వ్యక్తి పేరిట పట్టా చేయడంపై గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడే నష్టపోయినా...
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూమిని కోల్పోయిన ముంపు బాధితులకు ఇంటి స్థలం, సాగు చేసేందుకు కొత్త పోచంపాడ్ గ్రామంలో స్థలాన్ని కేటాయించారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కోల్పోయినంత భూమిని కాకుండా సగటు పద్ధతిన స్థలాలు కేటాయించి పట్టాలు చేసినట్లు గ్రామస్థులు చెప్తున్నారు. నిర్మాణ సమయంలోనే ఇళ్లు, పంటభూములు నష్టపోయి.. ప్రభుత్వం ఇచ్చిన అరకొర పరిహారంతో జీవనం సాగిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించిన భూమిని అక్రమంగా సొంతం చేసుకోవాలనుకోవడం అన్యాయమని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రాజెక్టు పరిహారం డబ్బులు ప్రభుత్వం ఇప్పటికీ అందించలేదని, గ్రామాభివృద్ధిని సైతం పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. ఉద్యోగం కల్పిస్తామన్న హామీ సైతం బుట్టదాఖలైందని, ఇవేవీ పట్టించుకోకుండా ఎవరికీ తెలియకుండా స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.