రాష్ట్రంలో ఎడతెరపి వానలు, వరదల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. టైఫాయిడ్ 5 రెట్లు వేగంగా వ్యాపిస్తోందని...అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 5 వేల 500లకుపైగా టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. పది జిల్లాల్లో టైఫాయిడ్ తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొంది. నిర్మల్‌లో 908 టైఫాయిడ్ కేసులు నమోదు కాగా.. మంచిర్యాలలో 658, సిద్దిపేటలో 391 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, నల్గొండ, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, మెదక్, భూపాలపల్లి జిల్లాల్లోనూ తీవ్రత అధికంగానే ఉంది.
రాష్ట్రంలో 12 వేల 600లకుపైగా అక్యూట్ డయేరియా 1300 డిసెంట్రీ కేసులు నమోదయ్యాయి. అక్యూట్ డయేరియా కేసులు అత్యధికంగా హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. ఈ ఏడాది మే నుంచి ఇప్పటివరకు భాగ్యనగరంలో 2350కిపైగా అక్యూట్ డయేరియా కేసులు నమోదు కాగా.. ఆదిలాబాద్‌లో 1300కుపైగా వెలుగుచూశాయి. గరిష్ఠస్థాయిలో కేసులు వస్తుండటంతో ఆరోగ్య శాఖ ప్రమత్తమైంది. జిల్లా స్థాయిలో రోగులకు అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచింది. ప్రజలకు అవసరమైన సేవలను అందించాలని సిబ్బందిని ఆదేశించింది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మూడ్రోజులు మించి జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటే తప్పక సమీపంలోనికి ఆస్పత్రికి వెళ్లాలని వైద్యారోగ్యశాఖ సూచించింది.