కరోనా మహమ్మారి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యాధికారులు, నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పది రోజుల పాటు లాక్డౌన్ కొనసాగుతుందని వివరించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు అధికారులతో మంత్రి సమీక్ష
నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
10 గంటల తర్వాత వ్యాపార సముదాయాలు మూసి ఉంచాలని, అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వ్యాక్సినేషన్, మందులు అందుబాటులో ఉంచాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 135 పడకలు, ప్రైవేటు ఆసుపత్రిలో 311 పడకలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కరోనా నియంత్రణకై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. జిల్లా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఇన్ఛార్జీ ఎస్పీ ప్రవీణ్ కుమార్, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.