తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీమే సవాల్: సమస్యలు తీరి సదుపాయాలు అందేనా నారాయణ...? - మున్సిపోల్స్​

నిజాం కాలంలోనే మున్సిపాలిటీలుగా గుర్తింపు పొందిన పట్టణాలవి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఆ పట్టణాల్లో ప్రగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగిళి అక్కడే.  మౌలిక వసతుల కల్పన విషయంలోనూ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. నారాయణపేట, మక్తల్, కోస్గి మున్సిపాలిటీల్లో సమస్యలు నేతలకు స్వాగతం పలుకుతున్నాయి.

SO MANY PROBLEMS IN NARAYANPET DISTRICT MUNICIPALITIES
SO MANY PROBLEMS IN NARAYANPET DISTRICT MUNICIPALITIES

By

Published : Jan 9, 2020, 7:40 PM IST

Updated : Jan 10, 2020, 3:01 PM IST

సమస్యలు తీరి సదుపాయాలు అందేనా నారాయణ...?

సమస్యలకు అడ్డాగా...

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే మొట్టమొదటిగా ఏర్పడిన మున్సిపాలిటీ నారాయణపేట. 1937లోనే మీర్ మజ్లిస్ బల్దియా పేరిట మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యానంతరం 1951లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. జిల్లాగా ప్రకటించిన అనంతరం నారాయణపేట పట్టణాన్ని ప్రస్తుతం 24 వార్డులుగా పునర్విభజించారు. 32వేల మంది ఓటర్లున్నారు. పేరుకు ఉమ్మడి జిల్లాలో తొలి పురపాలికే అయినా.. ప్రగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అపరిశుభ్రత పట్టణమంతా కళ్లకుకడుతోంది. మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికీ రావడం లేదు. సక్రమంగా అమలు కాని పట్టణ ప్రణాళిక, అక్రమ నిర్మాణాలు, కనిపించని పచ్చదనంతో సమస్యలకు అడ్డాగా నారాయణపేట మారిందని స్థానికులు వాపోతున్నారు.

మక్తల్​ రాత మారేనా...?

నారాయణపేట జిల్లాలోని మరో మున్సిపాలిటీ మక్తల్. 1954 నుంచి 1965 వరకూ పురపాలికగా ఉన్న మక్తల్ పట్టణం ఆ తర్వాత నిబంధనల మేరకు మేజర్ గ్రామ పంచాయతీగా మారింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2018 ఆగస్టు 2న మళ్లీ కొత్త పురపాలికగా ఏర్పడింది. జనాభా 21వేలు కాగా... 19వేల 984 ఓటర్లున్నారు. మక్తల్, చందాపూర్, తిరుమలపూర్,గార్లపల్లి గ్రామాలను కలుపుతూ పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి 16 వార్డులుగా విభజించారు. మొదటిసారిగా పురపోరుకు సిద్ధమైన మక్తల్ పట్టణంలోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. పేరుకు నియోజకవర్గ కేంద్రమైనా.. ప్రగతి మాత్రం శూన్యం.

కోస్గిలో అభివృద్ధి కూత పెట్టేనా...?

1955లో నిజాం పాలనలోనే కోస్గి మున్సిపాలిటీగా ఉండేదని చెబుతుంటారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018 ఆగస్టులో కోస్గిని మున్సిపాలిటీగా ప్రకటించారు. పోతిరెడ్డిపల్లి, తంపల్లి, మాసాయిప్లలి, మల్​రెడ్డిపల్లి, కోస్గిని కలిపి పురపాలికగా ఏర్పాటు చేశారు. జనాభా 21వేల318 కాగా... 17వేల323 ఓటర్లున్నారు. కోస్గి పట్టణాన్ని 16 వార్డులుగా విభజించారు. కోస్గి మున్సిపాలిటీ ప్రాంత ప్రజలను ప్రధానంగా ఇబ్బంది పెడుతున్న సమస్య 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం. రెండేళ్లైనా ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై జనం అసహనంతో ఉన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్ల నిర్మాణం లాంటి ఎన్నో సమస్యలతో సతమవుతున్న స్థానికులు... ఇప్పుడు ఏర్పడే పాలకవర్గమైనా తమ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నారాయణపేట జిల్లాల్లోని మూడు మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన, ఆహ్లాదం, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం ప్రధాన సమస్యలు కాగా... ఇవే రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారనున్నాయి.

Last Updated : Jan 10, 2020, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details